వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాను నమ్మిన నాయకుడి కోసం, అలాగే తనను నమ్ముకున్న అనుచరుల కోసం ఎందాకైనా అన్నట్టు ప్రాణం ఇచ్చే స్వభావం. అందుకే రోజా అంటే నమ్మకానికి పర్యాయపదంగా మారారు.
ఒక్కోసారి దూకుడు స్వభావంతో వివాదాస్పద రాజకీయ నేతగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు. అలాంటి వాటిని ఆమె ఎప్పుడూ పట్టించుకోరు. సహజంగా ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీమూర్తి ఉందంటారు. కానీ రోజా విషయంలో మాత్రం అందుకు రివర్స్. ఆమె విజయం వెనుక భర్త ఆర్కే సెల్వమణి ఉన్నారు.
రోజా భర్త కాకముందు ఆయన దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెప్సీ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కరోనా సెకెండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో షూటింగ్‌లపై ఆయన మాట్లాడారు.
ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఈ నెల 31వ తేదీ వరకు సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌లను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ అనంతర పరిస్థితులపై సెల్వమణి ఒక ప్రకటన చేశారు.
లాక్డౌన్ తర్వాత షూటింగ్స్‌కు సిద్ధం అవుతారని, అంతకు ముందుగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అప్పుడు మాత్రమే షూటింగ్స్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని ప్రతి ఆర్టీస్ట్ అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.