గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వస్తున్న బ్లాంక్ కాల్స్‌పై ప్రముఖ సింగర్ మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'ఆడపిల్ల నమ్మా' పాటతో యావత్ తెలుగు సమాజం అభిమానాన్ని చూరగొన్న మధుప్రియ చిన్నప్పటి నుంచే సింగర్‌గా గుర్తింపు పొందారు.
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఏ విధంగా వివక్షకు గురవుతుందో పాట రూపంలో చక్కగా ఆవిష్కరించిన మధుప్రియ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఫిదా సినిమాలో వచ్చిందే..అనే ఉర్రూతలూగించిన పాటను మధుప్రియ ఆలపించారు.
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు. జర్నలిస్టుగా, రచయితగా, గాయనిగా, బుల్లితెర , యూట్యూబ్ సెలబ్రిటీగా మధుప్రియ ఏం మాట్లాడినా, పాడినా ముద్దుగా ఉంటుంది.
ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించడంతో మరోసారి ఆమె పేరు వార్తలకెక్కింది. ఇటీవల కొంత కాలంగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మధుప్రియకు బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని సమాచారం.
ఈ విషయమై హైదరాబాద్ షీ టీమ్ కు మెయిల్ ద్వారా మధుప్రియ ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్‌ను షీ టీమ్స్ పోలీసులకు బదిలీ చేశారు. బ్లాంక్ ఫోన్ కాల్స్ వివరాలను సైబర్ క్రైమ్ వారికి మధుప్రియ అందజేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 509, 354 బి సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.