ప్రధాని మోదీ అంటే చంద్రబాబుకు ఎంత భయమో మరోసారి టీడీపీ నిర్వహించిన మాక్ అసెంబ్లీ సాక్షిగా బయట పడింది. ఎంత సేపూ జగన్ సర్కార్‌ను విమర్శించడమే తప్ప, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం టీడీపీ నేతల్లో కొరవడ్డాయని నిరూపించే ఘటన ఇది.
కరోనా విజృంభణను దృష్టిలో పెట్టుకుని వైసీపీ సర్కార్ బడ్జెట్ సమావేశాలను ఒక్కరోజుకే పరిమితం చేసింది. దీన్ని నిరసిస్తూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించింది. రెండురోజుల పాటు మాక్ అసెంబ్లీ సమావేశాలను టీడీపీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని మాక్ అసెంబ్లీలో టీడీపీ తప్పు పట్టింది. టీడీపీ ఏమైనా అద్భుతంగా చేసిందా అంటే అదీ లేదు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ తీర్మానం చేసి కేంద్రానికి పంపకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ గత గురువారం పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని మరోసారి గుర్తు చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రాంత ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీర్మానాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 32 మంది ప్రాణాల బలిదానంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని గుర్తు చేశారు. స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేంద్రం కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలని కోరారు.
ఇదే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండో రోజు నిర్వహించిన మాక్ అసెంబ్లీలో విశాఖ ఉక్కు పరిశ్రమపై చేసిన తీర్మానం ఏంటో తెలిస్తే … టీడీపీ ధైర్యసాహసాల గురించి వేనోళ్లు పొగడ్తలతో ముంచెత్తుతారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి చర్చించాలని నారా లోకేశ్ మాక్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశ పెట్టారు. “విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. దాన్ని కాపాడేందుకు రాష్ట్రం మొక్కుబడి తీర్మానం చేసి కేంద్రానికి పంపిచడం సరికాదు. ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఐకాస పోరాటానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇస్తూ సభ తీర్మానాన్ని ఆమోదిస్తోంది” అని తీర్మానం చదివి వినిపించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపడం టీడీపీ దృష్టిలో సరికాదట! పైగా ఇది మొక్కుబడి తీర్మానమని పేర్కొనడం మరో విడ్డూరం. ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి పోరాటానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇస్తూ టీడీపీ మాక్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించడం పెద్ద జోక్‌గా ప్రజా, కార్మిక సంఘాలు అభివర్ణిస్తున్నాయి.
ఒకవేళ టీడీపీ అధికారంలో ఉంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసేది కాదనేందుకు ఇదే నిదర్శనమని అధికార వైసీపీ నేతలు అంటున్నారు. పిరికితనానికి పెద్దన్న చంద్రన్న అనేలా మాక్ అసెంబ్లీలో టీడీపీ తీర్మానం ఉందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.