కండిషనల్ బెయిల్ పై బయటకొచ్చిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. టెక్నికల్ గా బయటకొచ్చారు కానీ, భౌతికంగా ఇంకా ఆయన నిర్బంధంలోనే ఉన్నారు. నిన్న సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆర్డర్ కాపీ ఇంకా అందకపోవడంతో రఘురామ మరో 2 రోజుల పాటు నిర్బంధంలోనే ఉండాల్సిన పరిస్థితి.
కోర్టు ఆర్డర్ చేతికి రావాలి. ఆ తర్వాత పూచీకత్తు సమర్పించాలి. ఈ రెండు పనులు చేయడానికి వీకెండ్ అడ్డొచ్చింది. ఈరోజు, రేపు కోర్టుకు శెలవులు. దీంతో సోమవారం వస్తే తప్ప రఘురామ బయటకొచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లోనే సేదతీరుతున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగేలా రఘురామ వ్యాఖ్యలు చేశారంటూ అతడిపై రాజద్రోహం కేసు పెట్టింది సీఐడీ. దీనిపై రఘురామ సుప్రీంకోర్టుకు వెళ్లారు. కేవలం ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కేసు మాత్రం అలానే ఉంది.
ఈ కేసుకు సంబంధించి సీఐడీ పక్కా ఆధారాలు సుప్రీంకోర్టుకు సమర్పించింది. గడిచిన కొన్ని నెలలుగా రఘురామ మాట్లాడిన మాటలన్నింటినీ వీడియోల రూపంలో భద్రపరిచి మరీ కోర్టుకు సమర్పించింది. వాక్ స్వాతంత్రం అంటూ రఘురామ తరఫు లాయర్ వాదించే ప్రయత్నం చేసినప్పటికీ కోర్టు అంగీకరించలేదు.
ఎంపీ అయినా, సగటు పౌరుడు అయినా రాజ్యంగం ముందు అందరూ ఒకటేనని అభిప్రాయపడిన అత్యున్నత ధర్మాసనం.. రాజద్రోహం ఆరోపణలకు సంబంధించి సీఐడీ విచారణకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఒకరోజు ముందు నోటీసులిచ్చి, లాయర్ సమక్షంలో విచారణ సాగించాలని మాత్రమే చెప్పింది. మరోవైపు మీడియాతో మాట్లాడకూడదంటూ రఘురామపై కూడా ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు.