విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం పట్టుదలగా ఉంటే తాము కూడా వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు. కార్మికులు. ఇప్పటికి సరిగ్గా వంద రోజుల క్రితం కేంద్ర బడ్జెట్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్థావన రావడంతో ఉలిక్కిపడిన కార్మికులు ఆందోళన బాట పట్టారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద నిర్వహిస్తోన్న నిరాహార దీక్షలకు ఈ రోజుతో వంద రోజులు కావస్తోంది. అలాగే నాటి నుంచి ఈనాటి వరకూ అనేక రూపాలలో ఆందోళన చేస్తూనే ఉన్నారు. మధ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చి వారికి గట్టి భరోసా ఇవ్వడమే కాకుండా తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు.
ఇదిలా ఉంటే ఉక్కు ఉద్యమానికి వంద రోజులు పూర్తి అయ్యాయి. కానీ కేంద్రం పలకడం లేదు, ఉలకడం లేదు. ప్రైవేటీకరణ విషయంలో ఊరటనిచ్చే ఒక్క మాట కూడా లేదు అంటున్నారు కార్మికులు. రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు కార్మికుల వైపు ఉందని, కేంద్రం కూడా తన మనసు మార్చుకుని విశాఖ ఉక్కుని కాపాడాలని కార్మికులు కోరుతున్నారు.
మొత్తానికి వంద రోజుల మార్క్ ని దాటిన సందర్భంగా వంద అడుగుల బ్యానర్‌తో తమ నిరసనను తెలియచేస్తున్నారు. తమ లక్ష్యాన్ని సాధించేవరకూ కొనసాగుతుందని ఉక్కు కార్మికులు గట్టిగానే చెబుతున్నారు.