మహారాష్ట్ర అధికార కూటమిలో గత మూడు, నాలుగు రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారా? ఆ పరిణామాల్లో… ఆంధ్ర నేతల్లో పోలికలను చూస్తున్నారు. కొన్ని పోలికలు ఇటు తెలుగుదేశంలోనూ, అటు వైసీపీలోనూ కనబడుతున్నాయి. జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
ముందుగా తెలుగుదేశం విషయానికి వస్తే – మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి ఓ కొడుకు ఉన్నాడు. శివసేన వ్యవస్థాప కులు బాలా సాహెబ్ థాకరేకి మనవడు. శివసేనకు వారసత్వ నేతగా అతనిని ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో చర్చలకు సైతం, శివసేన తరఫున ఆ 'పిల్లాణ్ణి' పంపించారు.
అతనిని కూడా ఉద్ధవ్ థాకరే-తన మంత్రి వర్గం లోకి తీసుకున్నారు. ఆ పిల్లాడికి తల్లి సపోర్టు. దానితో, అసలు పవర్ సెంటర్ (సీఎం స్థానం ) బలహీనపడి, అబ్బాయి పవర్ సెంటర్ వీర విహారం చేయడం మొదలైంది. శివసేన కోసం జీవితాలు అంకితం చేసిన సీనియర్ మంత్రుల పనిలో సైతం వేలు పెట్టడం, కాలు పెట్టడం ఎక్కువై పోవడంతో-ముఖ్యమంత్రి పదవిని కొద్దిలో మిస్ అయిన ఏక్ నాథ్ షిండే లాటి వారు సైతం తట్టుకోలేకపోయారు. ఒంటె కూడా ఎంత బరువు అయినా భరిస్తుందంటారు. భరించలేని దశ వస్తే – ఇక, గడ్డి పరక వేసినా దాని నడుం విరిగి పోతుంది అంటారు. ఆ సామెత చందంగానే ఇప్పుడు మహారాష్ట్ర శివసేనలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉద్ధవ్ థాకరే కొడుకు దాష్టికంతో నాయకులు విసిగి పోయిన ఫలితమే-ఉద్ధవ్ థాకరే నాయకత్వ పతనం.
దీని నుంచి తెలుగుదేశం పార్టీ నేర్చుకోవలసిన అంశాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలు టీడీపీలో పొడసూపకుండా చూసుకోవలసిన బాధ్యత ఇటు చంద్రబాబు నాయుడు, లోకేష్ పైన ఉంది.
ఇక, అధికార పార్టీ -వైసీపీ విషయానికి వస్తే ; ముంబైలో ముఖ్యమంత్రి అధికార నివాసం 'వర్ష' తలుపులు రెండున్నరేళ్ల తరువాత ఇప్పుడు తెరుచుకున్నాయని తిరుగుబాటు చేసిన శివసేన నేత ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యనించారు. అంటే-మంత్రులు, ముఖ్య నాయకులకు సైతం 'వర్ష' లోకి ఈ రెండున్నరేళ్ళల్లో నో ఎంట్రీ అన్న మాట. ఉద్ధవ్ థాకరేకు వెనుక నుంచి భార్య పెత్తనం- దీనికి అదనం. అది కూడా ఓ ప్రాంతీయ పార్టీ కావడంతో వాళ్ళు ముగ్గురే రాజులు. ఆ ముగ్గురే మంత్రులూ.
మనకు ఉన్న ప్రధాన పార్టీలు రెండూప్రాంతీయ పార్టీలే. ఇవి చాలవు అన్నట్టుగా ఇంకోటి తయారవడానికి ఆపసోపాలు పడుతోంది. ఆంధ్రలో కూడా ముఖ్యమంత్రి దర్శనం/క్యాంపు ఆఫీస్ ప్రవేశం కష్టంతో కూడుకున్న పనులని ప్రయత్నించి విఫలమైన వారు అంటారు.
అందుకే, మహారాష్ట్ర పరిణామాలకు ఆంధ్రలో పోలికలు కనబడుతున్నాయని అనేది. నాయకులు గుడ్డి, మూగ.. చెవిటి వారు కాదు కదా! అందరికీ మెదళ్ళు మోకాళ్ళ లోనే ఉండవు అనడానికి శివసేన పరిణామాలే ఓ ఉదాహరణ, హెచ్చరిక కూడా!
భోగాది వేంకట రాయుడు