పీజేఆర్…. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. కార్మిక నాయకుడిగా హైదరాబాద్‌లో తిరుగులేని పేరు సంపాదించుకున్నారు. ఆకస్మికంగా మరణించినా, పేదలు, కార్మికులు గుండెల్లో నిలిచిపోయారు. పీజేఆర్ మరణానంతరం ఆయన కుమారుడు విష్ణు కొంత కాలం యాక్టీవ్‌గా ఉన్నారు. ఇటీవల ఆయన ఉనికే కరువైంది. అసలు రాజకీయాల్లో ఉన్నారో, లేరో కూడా తెలియనంత అజ్ఞాతవాసం గడుపుతున్నారు.
పీజేఆర్ వారసురాలిగా ఆయన కూతురు విజయారెడ్డి రాజకీయ తెరపై కనిపిస్తున్నారు. పాపం ఎక్కడా కుదురుగా ఉండడం లేదు. కొంత కాలం వైసీపీ, ఆ తర్వాత టీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కార్పొరేటర్‌గా గెలుపొందారు. మేయర్ పదవి ఆశించి భంగపడ్డారు. టీఆర్ఎస్లో చురుగ్గా కొనసాగలేదు. మనసు కాంగ్రెస్‌పై మళ్లింది.
ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల సమక్షంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమె మాట్లాడుతూ సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేయడానికి వచ్చానన్నారు. పదవుల కోసం పార్టీ మారలేదన్నారు. ఇక మూడు రంగుల జెండా వదలనని స్పష్టం చేశారు.
తనదిక ఒకటే జెండా..ఒకటే బాటని పీజేఆర్ తనయ స్పష్టం చేశారు. సమీప భవిష్యత్‌లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదు. మరి ఆ పార్టీలో విజయారెడ్డి ఎంత కాలం మనుగడ సాగిస్తుందో కాలమే తేల్చాల్సి వుంది.