ఒక్కసారి వెనక్కు వెళ్లి పాత పత్రికలు తిరగేస్తే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయినపుడు మన పత్రికలు కొన్ని వండి వార్చిన అమోఘమైన కథనాలు కళ్ల ముందుకు వస్తాయి.
మంత్రి పదవి నుంచి తప్పించి, అంతకన్నా పెద్ద పదవి ఇవ్వడం మంచిదనే అందరూ అంటారు. కానీ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పించి, పక్కన వుంచారన్న భావన వెంకయ్య నాయడు అభిమానుల్లో కలిగింది. ఆంధ్రలోని ఓ వర్గం మీడియా ముందుగా ఆ విధంగానే కథనాలు వండి వార్చింది.
కానీ అది వెంకయ్య నాయుడుకు డ్యామేజ్ అవుతుందని భావించి మళ్లీ టోన్ మార్చింది. అత్యున్నత పదవిలో తెలుగువాడు అనే విధంగా, ఇంకా వెంకయ్య ప్రతిభా పాటవాల మీద కథనాలు వండి వార్చి, మంత్రి పదవి నుంచి, యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పించారన్న భావన జనాల్లో కలగకుండా వుండడానికి ప్రయత్నించారు.
కట్ చేస్తే, ఇప్పుడు వెంకయ్య పేరు రాష్ట్రపతి పదవికి పరిశీలనకు తీసుకోలేదు. దాంతో గతం అంతా మరోసారి గుర్తుచేసుకుంటూ కథనాలు వండడం ప్రారంభించారు. వాటిల్లో కీలకమైన పాయింట్ ఏమిటంటే ఉపరాష్ట్రపతి పదవి చేపట్టడానికి వెంకయ్య సుముఖత వ్యక్తం చేయలేదన్నది. ఈ పాయింట్ ను పదే పదే ప్రస్తావిస్తున్నారు.
మరి అప్పట్లో ఈ పదవి విషయంలో అంతా హ్యాపీ అని, ఇంత గొప్ప అని అంత గొప్ప అని వార్తలు, కథనాలు వండి వార్చి, మళ్లీ ఇప్పుడేమిటి ఇలా? అంటే అప్పుడు గౌరవమైన పదవి ఇవ్వడం ద్వారా వెంకయ్యను యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం చేసారన్నది వాస్తవం అనుకోవాలా?