Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఏపీ రాజకీయాలు.. అడుగడుగునా భారీ క్రేన్లు

ఏపీ రాజకీయాలు.. అడుగడుగునా భారీ క్రేన్లు

అన్నిట్లోనూ భారీతనం కోరుకునే తెలుగు ప్రజలు.. మరి టీ పొడిలో కూడా భారీతనం ఎందుకు కోరుకోరు.. అంటూ ఇటీవల రావు రమేష్ గొంతుతో ఓ అడ్వర్టైజ్ మెంట్ బాగా పాపులర్ అయింది. సరిగ్గా అలాంటి భారీతనమే తెలుగు నేతలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీ నేతలు. 

గతంలో నాయకులను కలిసేందుకు వచ్చేటప్పుడు శాలువా, పూలమాల, స్వీట్ బాక్స్ కామన్. ఆ తర్వాత బొకేలు, పూల కుండీలు వచ్చినా కూడా భారీతనం అని తెలియాలంటే.. భారీ మాల తీసుకు రావాల్సిందే. ఆ మాలను నలుగురైదుగురు వస్తాదుల్లాంటి మనుషులు మోసుకొస్తే.. ఆ రేంజే వేరు. అదే పూలమాలను మన కోసం ఏకంగా ఓ క్రేన్ సాయంతో తీసుకొస్తే.. అబ్బో అది వేరే లెవల్. 

ఇప్పుడు ఆ లెవల్ రాజకీయాలే ఏపీలో నడుస్తున్నాయి. పదవి ఉన్నా లేకపోయినా, పోటీ చేసినా చేయకపోయినా, రెండుచోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవకపోయినా.. నాయకులందరికీ ఇలాంటి గజమాలలే కావాలి. అవి వేసేందుకు ఓ భారీ క్రేన్ కావాలి.

రాజకీయాలకు, భారీ క్రేన్లకు అసలు సంబంధం ఉందా? మామూలుగా ఆలోచిస్తే ఉండదు. కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం ప్రస్తుతం భారీ క్రేన్లకే డిమాండ్. భారీ ఫ్లెక్సీ పెట్టకపోయినా పర్వాలేదు, స్వాగత తోరణాలు కట్టకపోయినా పర్వాలేదు. క్రేన్ లేకపోతే మాత్రం నేతలు ఊరుకోవడం లేదు. అంత డిమాండ్ వచ్చేసింది. 

ఈ క్రేన్లతో అభిమాన నాయకులకు గజమాలలు వేసి వారిని ఫుల్ ఖుషీ చేస్తున్నారు చోటా మోటా నేతలు. భారీగా తయారుచేసిన గజమాలలు వేసేందుకు, ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు క్రేన్లు కంపల్సరీ అయ్యాయి. పవన్ రోడ్డుపైకొచ్చాడంటే చాలు, అతడితో పాటు క్రేన్ కూడా రోడ్డెక్కాల్సిందే. గజమాలను గాల్లోకి లేపాల్సిందే.

పవన్ పర్యటనల్లో ఇవి సర్వసాధారణ విషయాలు. పవన్ పర్యటనలో క్రేన్ లేకపోతే వార్త. ఇప్పుడీ క్రేన్లను చినబాబు లోకేష్ కూడా గట్టిగా వాడుతున్నాడు. ప్రస్తుతం పల్నాడు పర్యటనలో ఉన్న లోకేష్ కు సత్తెనపల్లి వద్ద భారీ గజమాలతో స్వాగతం పలికారు. క్రేన్ సాయంతో దాన్ని లోకేష్ కు చూపించారు. ఈమధ్య చంద్రబాబు చేసిన ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా అక్కడక్కడ క్రేన్లు కనిపించాయి.

వైసీపీ వాళ్లు కూడా తక్కువ తినలేదు. కానీ మరీ పవన్, లోకేష్ అంత ఓవర్ అయితే చేయలేదు. వీరికి సెలబ్రేషన్స్ కి ఓ సమయం, సందర్భం ఉంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలో మంత్రులంతా వారి సొంత జిల్లాలకు వెళ్లినప్పుడు భారీ గజమాలలు క్రేన్ల సాయంతో వేశారు. మంత్రి రోజా ఈ క్రేన్ మాలతో తెగ సంతోషపడ్డారట. ఆమధ్య నెల్లూరులో ఫ్లెక్సీ గొడవ జరిగేటప్పుడు కూడా కాకాణికి ఇలా గజమాల వేసి సంతోష పెట్టారు అభిమానులు.

గజమాలతో ఫొటోలు.. ఆ తర్వాత కథలు

నాయకుడి ఎదుట గజమాలా హంగామా పూర్తయింది. మరి ఆ తర్వాత కథేంటి? క్రేన్ నుంచి జాగ్రత్తగా గజమాలను కిందకు దించుతారు.. మాలపై ఏ నేత ఫొటో ఉన్నా వాటిని పీకి పక్కన పడేస్తారు.. జాగ్రత్తగా పూలను వేరు చేసి దుకాణాలకు తరలిస్తారు. 

గజమాల లోపల ఉన్న కర్రలు, థర్మోకోల్ షీట్లను పక్కన పడేస్తారు.. క్రేన్ డ్రైవర్ పేమెంట్ తీసుకొని ఇంటికెళ్లిపోతాడు. మొత్తంగా 2 ఫొటోల కోసం ఓ 2 గంటల వ్యవహారం. ఈ వ్యవహారానికి ఇంత ఖర్చెందుకని అనుకుంటారా..? ఖర్చుదేముంది.. ఆ హంగామాలోనే ఉంది కిక్కు అంతా. 

గజమాల క్రేన్ తో తీసుకొచ్చి వేసి, నాయకుడి కళ్లలో ఆనందం చూసుకునే చోటా నేత సంతోషం వెలకట్టలేనిది. అదే మాల తనకి వేసేటప్పుడు ఆ నాయకుడి ఆనందం కూడా వెలకట్ట లేనిది. అందుకే ఈ గజమాలల వెల అమూల్యం. అది సామాన్యుడికి అనవసరం. క్రేన్ ఓనర్లకు మాత్రం వరం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?