పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదని అనుకుంటుందట. ఆ చందాన వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రాలో ఏఏ పార్టీలు ఎవరెవరికి మద్దతు ఇస్తాయో చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం పాపం ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడానికి మొహమాటపడ్డారు.
ఇవాళ ఆయన పలు అంశాలపై మీడియాతో ముచ్చటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతుపై విజయసాయిరెడ్డి చెప్పింది విని జర్నలిస్టులు నవ్వుకున్నారు. విజయసాయిరెడ్డి ఏమన్నారంటే…
“రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేయాలన్న అంశాన్ని పార్టీ అధినేత నిర్ణయిస్తారు. మేమంతా అధినేత ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం” అని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు బీజేపీ అభ్యర్థికే అని అందరికీ తెలుసు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి అంశంలోనూ వైసీపీ మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. పౌరసత్వ చట్టం, అలాగే వ్యవసాయ చట్టాలకు కూడా వైసీపీ, టీడీపీ మద్దతు పలికాయి. ఇలా ఒకట్రెండు కాదు, వ్యతిరేకించిన అంశాలేవీ లేవని లోకానికి తెలుసు.
తాజాగా రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును బీజేపీ ఖరారు చేసింది. ఎన్నిక జరగడమే ఆలస్యం. ఆమెకు ఓట్లు వేయడానికి ఏపీ అధికార పార్టీ సిద్ధంగా వుంది. కానీ దీనిపై సస్పెన్స్‌ను వైసీపీ కొనసాగించడం గమనార్హం. ఎవరి ఇబ్బందులు, భయాలు వాళ్లవి. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటాయి. కానీ ఏపీలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తాయడనంలో సందేహం లేదు.
టెక్నికల్‌గా మద్దతు విషయాన్ని విజయసాయిరెడ్డి ప్రకటించకపోయినప్పటికీ, ఆ మాత్రం అర్థం చేసుకోలేని పరిస్థితిలో జనం లేరు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు ఎవరికి వేయాలో పార్టీ అధినేత నిర్ణయిస్తారనే విజయసాయిరెడ్డి స్పందనపై …నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. విజయసాయిరెడ్డి జోకులేస్తున్నారని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఊరుకో విజయసాయి, మీరూ మీ జోకులూ అని సోషల్ మీడియాలో కామెంట్స్ ప్రత్యక్షమయ్యాయి. అంతేగా.