గుడ్డి ప్రేమ అంటే దృతరాష్ట్రుడి గురించి చెప్పుకోవాలి. అంధుడు కాబట్టి దుర్యోధనున్ని చూడలేడు. కళ్లతో చూడలేని కొడుకుపైన అంత ప్రేమ వుంటే, కంటికి కనిపించే పుత్రరత్నాలపైన ఇంకెంత వుండాలి. మన రాజకీయాలకి పట్టిన సమస్య ఇదే.
ఆనాటి భారతం నుంచి ఈనాటి వరకూ పుత్రులే పార్టీల కొంప ముంచింది. శివసేన చీలికలకు కూడా ఇదే కారణం. ఉద్ధవ్‌ఠాక్రే సీఎం అయ్యాకా, కొడుకు ఆదిత్యఠాక్రేకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుకి ఇదే మూలకారణం. ఆయన శాఖలో కూడా ఆదిత్య వేలు పెడుతూ వుండడంతో తిరగబడ్డాడు. 2006లో కూడా ఇదే జరిగింది. బాల్‌ఠాక్రే సోదరుడి కొడుకు రాజ్‌ఠాక్రే పార్టీ పగ్గాలు ఆశించాడు. అయితే బాల్‌ఠాక్రే తన కొడుకు ఉద్ధవ్ వైపు మొగ్గు చూపాడు. పార్టీ చీలిపోయింది.
గతంలో ఇందిరాగాంధీపై తిరుగుబాటు జరగడానికి (ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికలప్పుడు) సంజయ్ గాంధీనే కారణం. ఆయన పార్టీలో చక్రం తిప్పడం చాలా మందికి నచ్చలేదు. అధికారం కోసం వారసులు కొట్టుకోవడం వల్లే మొగలు సామ్రాజ్యం పతనమై పోయింది. అదే పద్ధతి ఇప్పుడు కూడా కొడుకులకి లైన్ క్లియర్ చేయడానికి, అప్పటి వరకు పార్టీ కోసం పని చేసే వాళ్లని పక్కన పెడతారు, లేదా బయటికి వెళ్లిపోయేలా చేస్తారు.
తెలంగాణాలో కేసీఆర్, ఆంధ్రాలో చంద్రబాబు చేసింది ఇదే. కేటీఆర్ సీన్‌లోకి వచ్చే సరికి చాలా మంది వెనక్కి వెళ్లిపోయారు. లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ని శాశ్వతంగా పక్కన పెట్టారు. అతను వుంటే పార్టీలో ముసలి వాసన తగ్గి కొంచెం గ్లామర్ వుండేది.
ఎన్టీఆర్‌కి కొడుకులతో సమస్య రాలేదు కానీ, అల్లుళ్లతో వచ్చింది. కరుణానిధికి ఇద్దరు కొడుకులు సమస్యలు తెచ్చారు. ఈ పోరులో స్టాలిన్ గెలిచాడు. అతని కొడుకు ఉదయనిధి అపుడే సిద్ధమవుతున్నాడు.
బీజేపీ అదృష్టం ఏమంటే వాజ్‌పేయ్‌కి వారసులు లేరు. అద్వానీకి ఉన్నా యాక్టీవ్‌గా లేరు. మోదీకి అస్సలు సమస్యే లేదు. ఆయన అమిత్‌షాకి, అదానీకి ఎన్ని పనులు చేసి పెట్టినా నిజాయితీపరుడుగా ముద్ర వుండడానికి కారణం, కుటుంబం, కొడుకులు లేకపోవడమే.
వైఎస్సార్ హయాంలో జగన్ జోక్యం ఎంతోకొంత వున్నా అది ఆయన ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేంత లేదు. సెకెండ్ టర్మ్‌లో వైఎస్ బతికి వుంటే ఏం జరిగేదో తెలియదు కానీ, అకస్మిక మరణం అన్నింటికీ తెరవేసింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో వున్న వారసులంతా, తండ్రుల పేరు చెప్పి అధికారం అనుభవించిన వాళ్లే. జగన్ ప్రత్యేకత ఏమంటే తండ్రి పేరుతో కొత్త పార్టీ పెట్టి కాంగ్రెస్‌ని ఫినీష్ చేయడం. బెంగాల్‌లో మమత చేసింది ఇదే అయినా ఆమెకి వారసత్వం లేదు.
రాజరికం పోయినా వారసత్వం పోలేదు. ప్రజాస్వామ్యం అంటూ వుంటాం కానీ, ఇప్పటికీ మన దేశంలో అధిక శాతం కుటుంబ పాలనే నడుస్తూ వుంది.
జీఆర్ మహర్షి