విశాఖను పరిపాలన రాజధాని చేయడంపై అధికార పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ కోస్టల్ బ్యాటరీ వద్ద ఉన్న జాలరిపేట, గంగమ్మ తల్లి గుడిలో ఇవాళ విజయసాయిరెడ్డి పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎవరు అడ్డుకున్నా, ఎవరు కాదన్నావిశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు తలకిందులుగా తపసు చేసినా విశాఖను పరిపాలన రాజధాని కాకుండా అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. పరిపాలన రాజధాని చేయడంలో కొంత ఆలస్యమైన మాట నిజమే అన్నారు. తప్పకుండా ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు మారుతుంది అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
ఒకవైపు మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను హైకోర్టు కొట్టేసింది. అస్సలు రాజధానిపై బిల్లు చేసే అధికారం రాష్ట్ర చట్టసభలకు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతి రాజధానిని ఆరు నెలల్లోపు అభివృద్ధి చేయాలని కూడా ఏపీ అత్యున్నత న్యాయస్థానం జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది కుదరదని ఇటీవల ఏపీ ప్రభుత్వం తరపున హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
రాజధానికి సంబంధించి తాము తీసుకొచ్చిన బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత హైకోర్టు తీర్పు ఇవ్వడంపై ఏపీ అసెంబ్లీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే రాజ్యాంగ వ్యవస్థల్లో ఎవరెవరికి ఏఏ హక్కులున్నాయో తేల్చాల్సిన అవసరం ఉందని పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చట్టసభ వేదికగా చర్చించారు.
రాజధానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఇంకా సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు. హైకోర్టు ఆదేశాలపైన్నే కౌంటర్ పిటిషన్లతో ఏపీ ప్రభుత్వం కాలం గడుపుతోంది. ఈ నేపథ్యంలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వెళ్లడాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పడం చర్చనీయాంశమైంది. అది ఎలా సాధ్యమనే చర్చకు తెరలేచింది.