టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత….చేయడానికి ఏమీ పనిలేనట్టుంది. తానేం మాట్లాడినా, ఎంత సేపు మాట్లాడినా ప్రసారం చేసే చానళ్లు, ప్రచురించే పత్రికలున్నాయనే ధైర్యంతో ఆయన రోజురోజుకూ చెలరేగిపోతున్నాడు. కరోనా వైరస్ కంటే చంద్రబాబు ప్రెస్‌మీట్ అంటే అమరావతిలో జర్నలిస్టులతో పాటు టీవీల్లో చూసేవాళ్లు కూడా హడలిపోతున్నారు.
బాబు ప్రెస్‌మీట్ గురించి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. ఆదివారం సాయంత్రం చంద్రబాబు మీడియా ముందుకొచ్చాడని, ఆయన ఏం మాట్లాడుతారో విందామని తాను, తన ఫ్రెండ్ టీవీ ముందు కూర్చున్నామన్నాడు. అయితే కూర్చునే ముందు బాబు ప్రెస్‌మీట్ చూడలేమని ముందే హెచ్చరించానన్నాడు. అయినా తెగించి కూర్చున్నామన్నాడు.
దాదాపు ఒక గంటా 35 నిమిషాల పాటు బాబు మీడియాతో మాట్లాడాడని చెప్పాడు. మొదట అమరావతి, రాజధాని, సింగపూర్, దుబాయ్, అమెరికా, ట్రంప్….తిరిగి రాజధాని, ఆ తర్వాత మళ్లీ కింది నుంచి పైకి పోయి, అక్కడి నుంచి తిరిగి అమరావతికి వచ్చాడని చెవిరెడ్డి చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ వేరే కార్యక్రమానికి పోవాల్సి ఉందన్నాడు. మరొకడు వచ్చి తన ఫ్రెండ్‌ను కార్యక్రమానికి పోదామని పిలవగా….ఎగిచ్చి తంతానని సీరియస్‌గా అన్నాడన్నాడు. చంద్రబాబు ప్రెస్ మీట్ వినడం వల్ల తన ఫ్రెండ్‌కు మైండ్ దొబ్బందని , గంట పాటు పడుకోబెట్టమని చెప్పి, ఆ ఫ్రెండ్ వెళ్లిపోయాడని చెవిరెడ్డి తెలిపాడు. అసెంబ్లీలో బాబు ప్రసంగాలను గంటల పాటు వినే అలవాటు ఉండటం వల్ల, తాము గట్టిపడ్డామని సరదాగా చెవిరెడ్డి చెప్పాడు.
చెవిరెడ్డి చెప్పాడని కాదు కానీ, బాబు ప్రెస్మీట్లు అంటే చాలు జర్నలిస్టులకు వణుకే. ఒకదాని కొకటి పొంతన లేకుండా గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతిరోజూ రెండు గంటల పాటు మీడియాను, ప్రజలను తన ప్రెస్మీట్లతో చావగొట్టాలని బాబు పనిగా పెట్టుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదో ఒక సాకు చూపి ఆయన మీడియా ముందుకు రావడం అలవాటుగా మారింది.
రెండు రోజుల క్రితం ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, జగన్ ప్రెస్‌మీట్‌పై స్పందించేందుకు బాబు ముందుకొచ్చాడు. సోమవారం కరోనాపై జగన్ వ్యాఖ్యలు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఆ వైరస్ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లడంపై బాబు తన సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చేందుకు మీడియా ముందుకొచ్చాడు.
జగన్ తుమ్మినా, దగ్గినా బాబు మీడియా ముందుకొస్తున్నాడు. జగన్ ఎందుకు తుమ్మాడు? ఎందుకు దగ్గాడు? ఆయనకేమైనా కరోనా లక్షణాలు ఉన్నాయా? అసలు కరోనా లక్షణాలంటే ఏమిటి? అది ఎలా విస్తరిస్తుంది? ఆ లక్షణాలున్నప్పుడు ఏం చేయాలి…తదితర నోట్స్‌తో ఆయన మీడియా ముందుకొచ్చి జర్నలిస్టులను, ప్రజలను చాకిరేవులో బట్టలు ఉతికినట్టు ఉతుకుతున్నాడు. సరిగ్గా ఐదు గంటలైతే చాలు బాబు మీడియా ముందు ప్రత్యక్షమవుతున్నాడు. ఇదెక్కడి గొడవరా బాబు అని ప్రజలు, జర్నలిస్టులు విలవిలలాడుతున్నారు.