చంద్రబాబు వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని జగన్ దాదాపు ఐదేళ్లుగా మొత్తుకుంటూనే ఉన్నారు. అయితే ఆ వ్యవస్థల్లో బాబు కోటరీ ఏ స్థాయి వరకు పాతుకుపోయింది, ఎంత నిర్వీర్యం అయిపోయిందనే విషయం జగన్ కు కూడా అప్పట్లో తెలియదు. ఇప్పుడిప్పుడే జగన్ కి ఒక్కొక్కటిగా బోధపడుతోంది. తన స్వార్థం కోసం చంద్రబాబు వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేశారో జగన్ కు సాక్ష్యాలతో సహా ఒక్కొక్కటిగా తెలిసొస్తోంది.
151 మంది ఎమ్మెల్యేల బలమున్న అధికార పక్షాన్ని, 23 మంది ఎమ్మెల్యేలలో ఒక్కొక్కరే చేజారిపోతున్నా చంద్రబాబు ఎలా గాభరా పెట్టగలుగుతున్నారో జగన్ తో పాటు జనంకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అధికారంలో ఉండగా చంద్రబాబు ప్రతి వ్యవస్థను నాశనం చేశారు, శాసన వ్యవస్థలో ఎలాగూ సొంత మనుషులే ఉంటారు కాబట్టి, పరిపాలనా వ్యవస్థతో తన పని మొదలుపెట్టారు బాబు. ఐఏఎస్, ఐపీఎస్ లలో కూడా కుల విద్వేషాలను రెచ్చగొట్టి తన సామాజిక వర్గానికి చెందిన, పూర్తిగా తన మనుషుల్ని కీలక పదవుల్లో పెట్టారు.
ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న రమేష్ కుమార్తెకు ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేట్ డైరెక్టర్ పదవినిచ్చి, ఆయనను తనకు విధేయుడిగా మార్చుకున్నారు. బాబు మాట మీరి ఆయన ఎలా ప్రవర్తించగలరు చెప్పండి. శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లడానికి కూడా బాబు రాజకీయమే కారణం. సాధారణంగా తటస్థులకే శాసన మండలి చైర్మన్ అవకాశాలిస్తుంటారు. కానీ బాబు భవిష్యత్ ఊహించి పార్టీ వీరవిధేయుడు షరీఫ్ ని చైర్మన్ చేశారు, ఫలితం మనం చూసిందే.
ఇక రాజధాని అభివృద్ధి మండలి పేరుతో బాబు సాగించిన అరాచకం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. సీఆర్డీఏ అధినేతగా తన నమ్మినబంటు నారాయణను నియమించారు. సీఆర్డీఏ మండలి సభ్యులు కూడా అంతే. ఇక కమిషనర్ గా నెల్లూరు కలెక్టర్ గా పనిచేస్తున్న ఐఏఎస్ చెరుకూరి శ్రీధర్ ని తీసుకొచ్చి పెట్టారు. ఇంటిపేరు చూస్తే ఈ వ్యవహారం ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనతో విభేదాలొచ్చాక లక్ష్మీ నరసింహాన్ని ఆ సీట్లో కూర్చోబెట్టారు.
ఇక పోలీస్ వ్యవస్థ. పోలీస్ బాస్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఎన్నికల సమయంలో టీడీపీకి ఎలా వంతపాడారో అందరికీ తెలుసు. ఏసీబీ నుంచి ఏరికోరి ఠాకూర్ ని తీసుకొచ్చి డీజీపీ చేసుకున్నారు చంద్రబాబు. ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావులాంటి వాళ్లు డిపార్ట్ మెంట్ లో ఎంతమంది ఉన్నారో లెక్కే లేదు. సరిగ్గా ఎన్నికలకు ముందు తన సామాజిక వర్గానికి చెందిన ఎంతమందిని ప్రమోషన్ల మీద బదిలీ చేసి అనుకూల స్థానాల్లో నియమించుకున్నారో జగన్ ఫిర్యాదుతో అప్పట్లోనే బైటపడింది.
చివరిగా న్యాయ వ్యవస్థ. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికీ లేనంత లాబీయింగ్ చంద్రబాబుకి కోర్టుల్లో ఉంది. సొంత రాష్ట్రం హైకోర్టే కాదు, పక్క రాష్ట్రాల కోర్టులు, సుప్రీంకోర్టులో కూడా బాబు అనుకూలురు, అనుయాయులు చాలామందే ఉన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల పేర్లు బైట పెట్టుకోవడం సబబు కాదు కాబట్టి.. బాబు సామాజిక వర్గానికి చెందిన వారి పేర్లు ఇక్కడ రాయడం లేదు. ఈ కోటరీ వల్లే బాబుపై ఒక్క కేసు కూడా ముందుకు కదలదు. చివరికి అది ఓటుకు నోటు కేసైనా సరే.
ఆఖరికి ఉద్యోగ సంఘాలను కూడా చంద్రబాబు రాజకీయం చేసేశారు. అశోక్ బాబు లాంటి తొత్తులకు పదవులిచ్చి మిగతా వాళ్లలో ఆశలు పుట్టించి అందర్నీ తనవైపు తిప్పుకున్నారు. సెక్రటేరియట్ ను వెలగపూడి నుంచి విశాఖకు మారుస్తామని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు వ్యతిరేకించడం చంద్రబాబు పన్నాగమే. చివరికి సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరుగుతున్న రోజువారీ కార్యక్రమాల అప్ డేట్స్ కూడా చంద్రబాబుకు ఏరోజుకారోజు వెళ్తున్నాయంటే.. ఆయన “మనుషులు” ఏ రేంజ్ లో పాతుకుపోయారో అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబు సృష్టించిన ఈ అవ్యవస్థను చక్కదిద్దడం కుదరని పని. ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడే ఎవరెవరు చంద్రబాబుకు మిత్రులో, ఎవరిని బాబు ఎక్కడపెట్టారో అర్థమవుతూ ఉంటుంది. వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఇప్పుడు తమాషా చూస్తున్న చంద్రబాబుని చావుదెబ్బ కొట్టాలంటే.. గాలమేసి ఒక్కొక్కరినీ ఒడిసి పట్టాలి, పక్కన పెట్టాలి. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నదదే.