పౌర స‌మాజ‌మే ప్ర‌తిప‌క్ష‌మా?

బీజేపీ అదృష్టం ఏమంటే దేశంలో క్రియాశీల‌క ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డం. 2024లో గెలుస్తామ‌నే ధైర్యం కూడా దీనివ‌ల్లే. కాంగ్రెస్ నిద్రావ‌స్థ‌లో వుండ‌డం, మిగిలిన‌వ‌న్నీ ప్రాంతీయ స్థాయిలో ఇరుక్కుపోయి, ఐక‌మ‌త్యం లేక కీచులాడ‌డంతో బీజేపీ ఆత్మ‌విశ్వాసం పెరిగింది.…

బీజేపీ అదృష్టం ఏమంటే దేశంలో క్రియాశీల‌క ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డం. 2024లో గెలుస్తామ‌నే ధైర్యం కూడా దీనివ‌ల్లే. కాంగ్రెస్ నిద్రావ‌స్థ‌లో వుండ‌డం, మిగిలిన‌వ‌న్నీ ప్రాంతీయ స్థాయిలో ఇరుక్కుపోయి, ఐక‌మ‌త్యం లేక కీచులాడ‌డంతో బీజేపీ ఆత్మ‌విశ్వాసం పెరిగింది. ఇందిరా, రాజీవ్ హ‌యాంలో కూడా ప్ర‌తిప‌క్షం త‌న పాత్ర‌ను పోషించింది. రాజీవ్ ప‌త్రికా బిల్లును తెస్తే దేశంలోని ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌మై తిప్పికొట్టాయి.

బీజేపీ విష‌యంలో ఆశ్చ‌ర్య‌క‌రంగా పౌర‌స‌మాజ‌మే ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తూ వుంది. అగ్నిప‌థ్ నిర‌స‌న ఇలాంటిదే. ప్ర‌తిప‌క్షాలు రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి కోసం వెతుకుతున్న‌ప్పుడు బీజేపీ ఈ బాణాన్ని వ‌దిలింది. ప్ర‌తిప‌క్షాలు కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మైతే పార్టీల‌తో సంబంధం లేని యువ‌కులు రోడ్డు మీదికొచ్చారు. స‌రైన నాయ‌క‌త్వం వుంటే వాళ్ల నిర‌స‌న హింసారూపం దాల్చేది కాదు. నాయ‌కుడు లేడు కాబ‌ట్టి ఇష్ట‌మొచ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.

రైతు ఉద్య‌మం కూడా ఇలాగే జ‌రిగింది. పార్టీల‌తో సంబంధం లేకుండా రైతులే రాజ‌ధాని మీదకి దండెత్తారు. క‌మ్యూనిస్టులు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ , రైతులే ముందుండి ఉద్య‌మాన్ని న‌డిపారు. మోదీని దిగొచ్చేలా చేసిన ఘ‌న‌త పౌర స‌మాజానిదే.

పౌర‌స‌త్వ బిల్లు విష‌యంలో కూడా ఇంతే. యువ‌త ముందుండి నిర‌స‌న తెలిపింది. బీజేపీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా చెల్ల‌ద‌ని యువ‌త రోడ్డుమీదకొచ్చి చెబుతోంది. ప్ర‌తిప‌క్షాలు ఎందుకింత నిస్తేజంగా వున్నాయంటే, ఏక‌త లేకుండా ఎవ‌రి ప‌రిధిలో వాళ్లు గిరిగీసుకుని వుండ‌డ‌మే కార‌ణం. పేరుకి కాంగ్రెస్ జాతీయ పార్టీ కానీ, అది ప్రాంతీయ పార్టీల కంటే బ‌ల‌హీనంగా వుంది. పంజాబ్‌, గోవాల్లో అధికారంలోకి రాలేక‌పోయింది. బీజేపీకి ఎదురుగాలి ఉన్నా గోవాలో గెల‌వ‌లేదు. పంజాబ్‌లో ఉన్న‌ది ఊడింది.

అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప‌రిస్థితి ఘోరంగా వుంది. బీజేపీకి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్త నిర‌స‌న చేసే స్థితిలో లేదు. ఇక ప్రాంతీయ పార్టీల్లో కొన్ని బీజేపీతో క‌లిసిపోయాయి. మ‌రికొన్ని త‌మ స్టేట్ వ‌ర‌కూ అధికారంలో వుంటే చాల‌నుకుంటాయి. టీఆర్ఎస్ నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ జోలికి పోలేదు. రైతు ఉద్య‌మం, పౌర‌స‌త్వ నిర‌స‌న‌ల్లో పాల్గొన‌లేదు. తెలంగాణాలో బీజేపీ బ‌ల‌ప‌డుతోంద‌ని అర్థ‌మ‌య్యే స‌రికి ఆ పార్టీని స‌వాల్ చేసి జాతీయ పార్టీ అంటున్నాడు కేసీఆర్. ఆయ‌న‌తో ఎవ‌రూ క‌లిసొచ్చే ప‌రిస్థితి లేదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్ని పార్టీలు బీజేపీకి అనుకూల‌మే. శ‌ర‌ద్‌ప‌వార్‌, మ‌మ‌త‌, శివ‌సేన‌, ఎస్పీ , బీఎస్పీ, ఆర్జేడీ ఇవ‌న్నీ ఏక‌తాటిపై క‌లుసుకోలేవు. ఎంతోకొంత బీజేపీని క‌ష్ట‌మోన‌ష్ట‌మో గ‌ట్టిగా వ్య‌తిరేకించేది ఆమ్ ఆద్మీ పార్టీనే. దానికి దేశ వ్యాప్త బ‌లం లేదు.

అందుకే ప్ర‌తిప‌క్షాలు చేయాల్సిన ప‌నిని పౌర స‌మాజం చేస్తోంది. మ‌న దేశంలో ఇదో కొత్త ప‌రిణామం.

జీఆర్ మ‌హ‌ర్షి