సమ్మె చేస్తోంది కార్మికులు. కనీస వేతనం అడుగుతున్నది కార్మికులు. ఇలాంటి సందర్భంలో “పరిశ్రమ అట్టడుక్కి వెళ్లిపోయింది, కంచం నిండా అన్నం దొరకడం కష్టంగా ఉంది” లాంటి డైలాగులు చెప్పడం కరెక్ట్ కాదేమో. కానీ సీనియర్ నటుడు నరేష్ మాత్రం ఇలాంటి మాటలే మాట్లాడారు. సినీ పరిశ్రమ అట్టడుగు స్థాయికి వెళ్లిపోయిందని, కార్మికులు నానా ఇబ్బందులు పడ్డారని, కరోనా టైమ్ లో వైద్య ఖర్చులకు కూడా లేకుండా ప్రాణాలు కోల్పోయారని, పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టైమ్ లో మెరుపు సమ్మె చేయడం కరెక్ట్ కాదని అన్నారు నరేష్.
అయితే కరోనా వల్ల ఎక్కువగా నష్టపోయింది కార్మికులే అనే విషయాన్ని నరేష్ మరిచిపోతున్నారు. వైద్యానికి కూడా డబ్బుల్లేకుండా ప్రాణాలు కోల్పోయింది ఆ కార్మికులే. ఇప్పుడు ఆ కార్మికులే జీతాలు పెంచాలని సమ్మె చేస్తున్నారు. అలాంటి కార్మికులు మెరుపు సమ్మె చేయడం కరెక్ట్ కాదంటున్నారు నరేష్. పరిశ్రమ అంధకారంలోకి వెళ్లకుండా ఆపాలని.. షూటింగ్స్ ఇంకొన్ని రోజులు ముందుకు సాగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరి పారితోషికాల సంగతేంటి..?
ఇదే కరోనా టైమ్ లో ఓవైపు డబ్బుల్లేక కార్మికులు ప్రాణాలు కోల్పోతే, మరోవైపు హీరోలు పారితోషికాలు పెంచుకున్నారు. ఓ సినిమా హిట్టయిందని ఓ పెద్ద హీరో తన పారితోషికాన్ని అమాంతం 18 కోట్ల రూపాయలకు చేర్చాడు. మరో స్టార్ హీరో ఎప్పట్లానే తన పారితోషికాన్ని, హిట్-ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకు 20 శాతం చొప్పున పెంచుకుంటూ పోయాడు. ఓ పెద్ద కాంపౌండ్ కు చెందిన హీరోల గ్రూప్ లో ఇద్దరు తప్ప మిగతా హీరోలంతా తమ రెమ్యూనరేషన్లు పెంచుకున్నారు.
హీరోల సంగతి కాసేపు పక్కనపెడదాం.. కాస్త డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కరోనా టైమ్ లోనే కాల్షీట్ రేట్లు పెంచుకున్నారు. ముంబయి నుంచి వచ్చి షూటింగ్ పూర్తిచేసి, తిరిగి ముంబయి వెళ్లిపోయే ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు, కరోనా తర్వాత తన కాల్షీట్ రేటును 50వేలు పెంచాడు. హైదరాబాద్ లోనే ఉంటున్న మరో డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టు కాల్షీట్ మీద 10వేల రూపాయలు ఎక్స్ ట్రా వేసుకున్నాడు. క్యారెక్టర్ రోల్స్ తో పాటు విలన్ రోల్స్ పోషిస్తున్న ఓ నటుడు.. ఒకే కాల్షీట్ ను 2 ముక్కలు చేసి, 2 పేమెంట్స్ తీసుకుంటున్నాడు. అంతెందుకు, చివరికి ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోయిన్లు కూడా తమ రేట్లు సవరించారు.
సినీ కార్మికుల డైలీ పేమెంట్స్ ఇలా..?
మరి కరోనా తర్వాత కార్మికుల వేతనాలు పెరిగాయా? అస్సలు పెరగలేదంటున్నారు కార్మికులు. 13 నెలలుగా వేతనాల పెంపు కోసం ఎదురుచూసి ఇప్పుడు సమ్మెకు దిగామంటున్నారు. ముందస్తుగా లెటర్ ఇచ్చిన తర్వాతే సమ్మె చేస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. ఉన్నఫలంగా ఇలా లెటర్ ఇచ్చి అలా సమ్మెకు దిగారని ఫెడరేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంగతి పక్కనపెడితే.. అసలు సినీ కార్మికులకు రోజువారీ ఇచ్చే వేతనాలు యావరేజ్ గా ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
షూటింగ్ లో ప్రొడక్షన్ బాయ్ కు భోజనం పెడుతూ రోజుకు 1145 రూపాయలు ఇవ్వాలి. డ్రైవర్ కు రూ.1055 రూపాయలివ్వాలి. లైట్ మేన్ కు 1100 రూపాయలు, డాన్సర్ కు 2800 రూపాయల పేమెంట్స్ ఉన్నాయి. ఈ లెక్కలన్నీ సోమవారం నుంచి శనివారం మాత్రమే. ఆదివారం షూటింగ్ పెట్టుకుంటే ఇంకాస్త ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పేపర్ పై ఉన్న ఈ మొత్తం నేరుగా వర్కర్ కు వెళ్లదు. అందులో కొంత కట్ అయిన తర్వాతే కార్మికుడికి వెళ్తుంది.
ఇప్పుడీ మొత్తాల్నే అటుఇటుగా 30శాతం పెంచమంటున్నారు కార్మికులు. ఈ మేరకు నిర్మాతల మండలి నుంచి రాతపూర్వక హామీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ మొత్తాలు ఎక్కువని కొందరికి అనిపించొచ్చు. ప్రతి రోజూ పని దొరికితే ఈ మొత్తం ఎక్కువే. కానీ సినీ కార్మికుడికి ప్రతి రోజూ పని దొరుకుతుందనే గ్యారెంటీ లేదు.
డిమాండ్ ఉంది కాబట్టి పారితోషికం పెంచుకుంటున్నామని నటీనటులు చెప్పొచ్చు. కానీ సినీ కార్మికుల సమ్మెను ఇలా డిమాండ్-సప్లయ్ లెక్కల్లో ఆలోచించకూడదని అంటున్నారు కొందరు సినీపెద్దలు. తాజా సమ్మెతో చాలా సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. చిరంజీవి భోళాశంకర్, ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమా, సాయితేజ్-కార్తీక్ దండు మూవీ షూటింగ్స్ ఆగినట్టు తెలుస్తోంది. అటు రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న పలు హిందీ సినిమాల షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి.