విశాఖ పెట్టుబడులకు కీలక ప్రాంతమని దేశ విదేశాలలో ఉన్న పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. ఎయిర్, సీ, రోడ్, రైల్ కనెక్టివిటీ కలిగి ఉన్న విశాఖ ఏపీ టోటల్ స్టేట్ కే డెస్టినీ పాయింట్ గా ఉంది. విభజన తరువాత కొన్నేళ్ళ పాటు నిర్లక్ష్యానికి గురి అయినా ఇపుడిపుడే ఫోకస్ అవుతోంది.
ఒక విధంగా విశాఖ రాజధాని అని జగన్ సర్కార్ ప్రతిపాదించడం, దాని మీద టీడీపీ రచ్చ చేయడంతో జరిగిన విపరీత ప్రచారం విశాఖకు చాలా పెద్ద మేలే చేసింది. విశాఖ పొటెన్షియాలిటీ కూడా లోకానికి అర్ధమైంది. ఫలితం చూస్తే నిన్న ఇన్ఫోసిస్, నేడు రహేజా రేపు మరోటి ఇలా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు బిగ్ షాట్స్ ఉత్సాహాం చూపిస్తున్నారు.
లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే రహేజా గ్రూప్ విశాఖలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం. ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఓపీ నందా సారధ్యంలోని బృందం రాష్ట్ర పరిశ్రమల మంత్రి గుడివాడ అమరనాధ్ ని కలసి చర్చించడం విశేషం.
విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు వాతావరణంతో పాటు అందుబాటులో ఉన్న భూములు తమకు ఎంతగానో అనుకూలమని రహేజా గ్రూప్ ప్రతినిధులు మంత్రి దృష్టి తెచ్చారు. ఐటీ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొనడం గమనార్హం.
ఇంతకీ రహేజా గ్రూప్ అంటే ఏంటి అన్నది చూస్తే దేశ విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన హొటెల్స్ ఈ సంస్థకు ఉన్నాయి. అలాగే ఐటీ సంస్థలు ఉన్నాయి. విశాఖలో కనుక పెద్ద ఎత్తున పెట్టుబడులు వివిధ రంగాల్లో పెట్టేందుకు ముందుకు వస్తే ప్రభుత్వ సాయాన్ని పూర్తి స్థాయిలో అందిస్తామని మంత్రి గుడివాడ వారికి హామీ ఇవ్వడం జరిగింది.
ఉత్తరాంధ్రా మీద ప్రత్యేకించి విశాఖ మీద గత మూడేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్ పెట్టిన శ్రద్ధ ఫలితమే ఈ రోజున పెట్టుబడులకు అవకాశాలు మెరుగు అయ్యాయని మంత్రి అంటున్నారు. మొత్తానికి విశాఖ దశ తిరుగుతోంది అని గట్టిగానే భావించాలి.