ఇంట‌ర్ ఫ‌లితాల్లో కృష్ణా ఫ‌స్ట్‌, క‌డ‌ప లాస్ట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఎగ్జామ్స్‌ -2022 ఫ‌లితాలను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేశారు. రెండు సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ కోర్సుల ఫలితాలను వెల్ల‌డించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. మే 6 నుంచి జూన్ 28 వరకు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఎగ్జామ్స్‌ -2022 ఫ‌లితాలను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేశారు. రెండు సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ కోర్సుల ఫలితాలను వెల్ల‌డించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. మే 6 నుంచి జూన్ 28 వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,69,059 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఒకేషనల్‌లో 79 వేల 22 మంది పరీక్ష రాశారు. ఇదిలా వుండ‌గా 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం.

ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌లో ఉమ్మ‌డి కృష్ణా జిల్లా ఫ‌స్ట్‌, క‌డ‌ప జిల్లా లాస్ట్‌లో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా చివ‌ర్లో నిల‌వ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. రెండేళ్ల ఫ‌లితాల్లోనూ బాలిక‌లదే పైచేయి. ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో 54%, సెకెండ్ ఇయ‌ర్‌లో 61 % ఉత్తీర్ణ‌త సాధించారు.

ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో బాలురు 49%, బాలిక‌లు 65% ఉత్తీర్ణ‌త సాధించారు. సెకెండ్ ఇయ‌ర్ విష‌యానికి వ‌స్తే… బాలురు 59%, బాలిక‌లు 68 % ఉత్తీర్ణ‌త సాధించ‌డం విశేషం. ఉత్తీర్ణ‌తో బాల‌బాలిక‌ల మ‌ధ్య 9 శాతం వ్య‌త్యాసం ఉండ‌డం గ‌మ‌నార్హం. ఉత్తీర్ణతలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఫ‌స్ట్ ప్లేస్‌లోనూ, ఉమ్మడి కడప జిల్లా లాస్ట్ ప్లేస్‌లో నిలిచాయి. ఈ నెల 25 నుంచి జూలై 5 వరకూ రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని మంత్రి బొత్స తెలిపారు.

ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించ నున్న‌ట్టు మంత్రి తెలిపారు. గ‌తం కంటే ఉత్తీర్ణత త‌గ్గ‌డంపై స్పందించాల‌ని మీడియా కోర‌గా, ప‌రీక్ష‌ల్లో ఇలాంటివి స‌ర్వ‌సాధార‌ణ‌మే అని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌మ ప్ర‌భుత్వం విద్య‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తోంద‌న్నారు. దేశంలోనే విద్యారంగంలో త‌మ ముఖ్య‌మంత్రి విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొస్తున్నార‌ని వెల్ల‌డించారు.