శ్రీనువైట్ల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులిచ్చాడు. వినాయక్ కూడా ఈమధ్య వరుసగా ఫ్లాపులిస్తూ వస్తున్నాడు. ఈ లిస్ట్ లో పూరి జగన్నాధ్ కూడా కొనసాగుతున్నాడు. కానీ ఒకే ఒక్క ఫ్లాప్ తో ఏకంగా ఈ జాబితాలోకి చేరిపోయాడు బోయపాటి శ్రీను.
ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత హయ్యస్ట్ సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు బోయపాటి. అప్పుడెప్పుడో దమ్ము రూపంలో ఓ ఫ్లాప్ తగిలింది. మళ్లీ రీసెంట్ గా వినయ విధేయ రామతో మరో ఫ్లాప్ ఇచ్చాడంతే. కానీ బోయపాటిని పైన చెప్పుకున్న దర్శకుల లిస్ట్ లోకి చేర్చేశారంటే, వినయ విధేయరామ ఏ రేంజ్ ఫ్లాపో అర్థం చేసుకోవచ్చు.
కేవలం 2 ఫ్లాపులతో దర్శకుడి కెరీర్ ముగిసిపోదు. మరీ ముఖ్యంగా బోయపాటి లాంటి మాస్ దర్శకుడు రెండు ఫ్లాపులకే దుకాణం సర్దేయడు. కానీ బోయపాటిని పైన చెప్పుకున్న క్యాటగిరీలోకి చేర్చేశారంటే దానికి కారణం వినయ విధేయరామ సినిమాలో కథ, స్క్రీన్ ప్లే.
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బోయపాటిలో జ్యూస్ అయిపోయిందంటున్నారు. 90ల నాటి కథ, టేకింగ్ తో ఈ సంక్రాంతిని నీరుగార్చేశాడంటూ బోయపాటిపై కామెంట్స్ చేస్తున్నారు. వినయ విధేయ రామకు ప్రస్తుతానికి మంచి వసూళ్లు రావొచ్చు.
కానీ కచ్చితంగా ఈ సినిమా చూసి మరో హీరో బోయపాటికి అవకాశమిచ్చే పరిస్థితి లేదు. తన ప్రతి ఇంటర్వ్యూలో బోయపాటి చెబుతున్న హీరోలెవరూ ఈసారి అతడికి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. బోయపాటి తన నెక్ట్స్ సినిమాను ఎవరితో తీస్తాడో చూడాలి.