ప్రముఖ న‌టిని నిష్టూర‌మాడిన నెటిజ‌న్‌

ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు రేణూదేశాయ్‌ని ఓ నెటిజ‌న్ నిష్టూర‌మాడారు. ఇటీవ‌ల ఆమె కోవిడ్‌తో బాధ‌ప‌డుతున్న పేద‌ల‌కు ఆక్సిజ‌న్‌, బెడ్ త‌దిత‌ర సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఆమెను ప్ర‌శంసిస్తున్నారు. ఇదే…

ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు రేణూదేశాయ్‌ని ఓ నెటిజ‌న్ నిష్టూర‌మాడారు. ఇటీవ‌ల ఆమె కోవిడ్‌తో బాధ‌ప‌డుతున్న పేద‌ల‌కు ఆక్సిజ‌న్‌, బెడ్ త‌దిత‌ర సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఆమెను ప్ర‌శంసిస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో కొన్ని విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ధ‌న‌వంతుల‌కే సాయం అందిస్తున్నార‌నే నెటిజ‌న్ విమ‌ర్శ‌కు రేణూదేశాయ్ దీటుగా స‌మాధానం ఇచ్చారు.

త‌న‌పై విమ‌ర్శ‌ల‌కు సంబంధించి స్క్రీన్ షాట్‌ల‌ను తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి… రేణూ దేశాయ్ మ‌రీ కౌంట‌ర్ ఇచ్చారు. కోవిడ్ బాధితుల‌కు సాయం అందించ‌డంతో త‌ల‌మున‌క‌లై ఉన్నాన‌ని, అన‌వ‌స‌ర మెసేజ్‌ల‌తో విసిగించొద్ద‌ని ఆమె రెండు రోజుల క్రితం కోరారు. అయిన‌ప్ప‌టికీ ఆమెకు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. తాజాగా ఎదురైన నెగెటివ్ కామెంట్ గురించి తెలుసుకుందాం.

సాయం చేస్తున్నా అంటూ కేవలం ధనవంతులనే పట్టించుకుంటున్నారని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. అలాగే మధ్య తరగతి వాళ్లకు సాయం చేయడం లేదని స‌ద‌రు నెటిజ‌న్ నిందించాడు. డబ్బులు ఉన్నవాళ్లవే ప్రాణాలు కానీ మధ్య తరగతి మనుషులవి ప్రాణాలు కాదా? అని నిలదీశాడు. ఈ నెగెటివ్ కామెంట్స్ రేణూ దేశాయ్‌ని మాన‌సికంగా ఇరిటేట్ చేశాయి. దీంతో ఆమె సీరియ‌స్‌గా స్పందించారు.  

“10, 12 రోజులుగా నాకు తోచినంత సాయం చేస్తూ వస్తున్నాను. మీరు ప్రశ్నించడానికి నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదు, మీరు ఎన్నుకున్న లీడర్‌ను అసలే కాదు. ఈ ప‌నేదో  మీరు ఎన్నుకున్న లీడ‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లి నిల‌దీయండి. కొందరు హెల్ప్‌ చేస్తారా? లేదా? అంటూ దురుసుగా మాట్లాడుతున్నారు, డిమాండ్‌ చేస్తున్నారు. 

ఈ ధోర‌ణులు మంచి చేయాలన్న నా సంకల్పాన్ని దెబ్బ‌తీస్తున్నాయి. పొరపాటున మీ మెసేజ్‌ను వదిలేసుంటే మరొకసారి గుర్తు చేయండి. ఎందుకంటే ఓవైపు సాయాన్ని అర్థిస్తూ, మరోవైపు పనికిరాని చెత్త మెసేజ్‌లతో నా ఇన్‌బాక్స్‌ నిండిపోయింది. దయచేసి అర్థం చేసుకోండి' అని రేణూ దేశాయ్ త‌న‌దైన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు.

ఉచితంగా ఇచ్చే వాళ్లుంటే… ప్రాణాలు పోయే వాళ్లు కూడా లేచి వస్తారంటే ఇదే కాబోలు. స‌మాజానికి ఏమీ చేయ‌ని వాళ్ల‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌రు. కానీ త‌మ శ‌క్తి మేర‌కు విప‌త్కాలంలో సేవ చేద్దామ‌ని ముందుకొస్తున్న రేణు లాంటి వాళ్ల‌కు మాన‌సిక క్షోభ త‌ప్ప‌డం లేదన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.