తెలంగాణ ఉద్యమసమయంలో తెలంగాణకు చెందిన నటులను తెలుగు సీమలో ఆంధ్రావాళ్లు తొక్కేశారని, హిందీసీమలో పేరు తెచ్చుకుంటే వాళ్లను పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. ఉదాహరణగా జయరాజ్ అనే నటుణ్ని ఉదహరిస్తూ వచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక మళ్లీ ఆయన గురించి పెద్దగా పట్టించుకున్నది లేదు. జయరాజ్‌తో పాటు మరొక హైదరాబాదీ నటుడు కూడా బొంబాయిలో పేరు తెచ్చుకున్నాడని అప్పుడే కాదు, యిప్పుడూ తలవరు. అతని పేరు చంద్రశేఖర్. అతని గురించి చెప్పబోయే ముందు పైడి జయరాజ్ గురించి తెలియనివాళ్లకు ఆయన గురించి రెండు ముక్కలు. ఆయన సరోజినీ నాయుడు భర్త గోవిందరాజులు నాయుడు మేనల్లుడు. 1909లో సిరిసిల్లలో పుట్టాడు. హైదరాబాదులో నిజాం కాలేజీలో చదివాడు. సైలెంటు సినిమాల శకంలోనే బొంబాయి వెళ్లి హిందీ, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ సినిమాల్లో నటిస్తూ వచ్చాడు.
హీరోగా కంటె కారెక్టరు యాక్టరుగా పేరు తెచ్చుకున్నాడు. ఆరు దశాబ్దాలకు పైగా ఫీల్డ్‌లో వున్నాడు. మొత్తం మీద 300 సినిమాల్లో వేశాడు. సినిమాలు నిర్మించాడు, దర్శకత్వం వహించాడు. బొంబాయిలో అనేక ఫంక్షన్‌లలో డేవిడ్, ఈయనా కంపియర్స్‌గా వుంటూండేవారు. 1980లో దాదాసాహెబ్ ఫాల్కే ఎవార్డు యిచ్చారు. 91వ ఏట మరణించాడు. తెలుగు సినిమాల్లో అస్సలు వేయకపోవడం చేత, మద్రాసు సినిమా ఫంక్షన్లకు రాకపోవడం చేత, తెలుగు ప్రేక్షకులకు బొత్తిగా తెలియదు. హిందీ సినిమా పత్రికలు కూడా ఆయన్ను జయరాజ్ అనే ప్రస్తావించేవి తప్ప యింటిపేరు ఎప్పుడూ చెప్పలేదు. ఈ చంద్రశేఖర్ కూడా అంతే. పూర్తి పేరు చంద్రశేఖర్ వైద్య అని నాకు యీ మధ్యే తెలిసింది. తెలుగు మాతృభాష అవునో కాదో తెలియదు. మరాఠీ కావచ్చు. కానీ హైదరాబాదు వాసే. ప్రస్తుతం 97 ఏళ్లు. కొన్ని హిందీ సినిమాల్లో హీరోగా, చాలా సినిమాల్లో కారెక్టరు యాక్టరుగా వేశాడు.
నా తరం వాళ్లలో కూడా అతని పేరు చెపితే చాలామందికి బల్బు వెలగదు. అందువలన అతని మీద చిత్రీకరించిన కొన్ని పాప్యులర్ గీతాలు ఉదహరించి, యూ ట్యూబ్ లింకులు యిస్తున్నాను. ‘లాగీ ఛూటేనే అబ్‌తో సనమ్’ (కాలీ టోపీ లాల్ రుమాల్) ‘, తస్‌వీర్ బనాతా హూఁ, తస్‌వీర్ నహీ బన్‌తీ’ (బారాదరీ – 1955), ‘ఇక్ చమేలీకే మండ్‌వే తలే’ (చా,చా,చా) . ‘బినా తుమ్హారే మజా క్యా హై’ (స్ట్రీట్ సింగర్) అతను ఒక డాక్టరు గారబ్బాయి. 1940లలో నిజామ్‌కు వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్నాయి. ఏ మాత్రం అనుమానం వచ్చినా పోలీసులు యువకులను పట్టుకుని జైల్లో పడేస్తున్నారు. అందుకని యితను కాలేజీ చదువు మానేసి, సినిమారంగానికి వెళతానని అడిగితే యింట్లో వాళ్లు తక్షణం ఒప్పేసుకున్నారు. 1941లో మద్రాసు వెళ్లి దక్షిణాది సినిమాల్లో ప్రయత్నిస్తే వేషాలు దొరకలేదు. ఓ ఏడాది వుండి తిరిగి వచ్చేసినప్పుడు ఎవరో ‘బొంబాయి వెళ్లవచ్చుగా’ అన్నారు.
బొంబాయిలో రోజుకి రూపాయిన్నర జీతంపై జూనియర్ ఆర్టిస్టు వేషాలు దొరికింది. 15 రోజులు పోయేటప్పటికి కాస్త మొహం చూపించే ఆర్టిస్టు వేషం దొరికి జీతం ఎనిమిది రూపాయలైంది. ఒకసారి ఓ జూనియర్ ఆర్టిస్టు సప్లయిర్‌కు, అతనికి అప్పిచ్చిన పఠాన్ అనే అతని మధ్య సోడాబాటిళ్ల యుద్ధం జరిగింది. ఇతను సప్లయిర్‌కు అండగా నిలబడడంతో అతను మెచ్చి, యితనికి మరిన్ని వేషాలు యిప్పించాడు. ఓ కోరస్‌లో యితని పెర్‌ఫామెన్స్ చూసి నచ్చిన గాయని షంషాద్ బేగమ్ పూనాలోని శాలిమార్ స్టూడియోస్‌కు సిఫార్సు చేసింది. వాళ్లు నెలకు రూ.60 జీతంపై తీసుకున్నారు. అతనక్కడ వుండగానే దేశవిభజన జరిగింది. పాకిస్తాన్‌లో ఐతే పోటీ తక్కువుంటుందని అనుకుని అక్కడకు వెళ్లాడు. కానీ ఉండలేకపోయాడు. తిరిగి బొంబాయి వచ్చాడు.
దివాన్ ఖేరా అనే రచయిత ద్వారా దర్శకనిర్మాత శాంతారామ్‌తో పరిచయం ఏర్పడింది. నెలకు రూ.75 జీతంపై పని దొరికింది. శాంతారామ్ వద్ద రెండు సంవత్సరాలు వుండి ఆయన తీసిన ‘‘అప్నాదేశ్’’, ‘‘దహేజ్’’సినిమాల్లో చిన్న వేషాల్లో నటించాడు. అక్కడే భరత్ భూషణ్ అనే హీరోతో పరిచయమైంది. అతను ‘లఖనవ్‌లో నన్నూ, పూర్ణిమను హీరోహీరోయిన్లుగా పెట్టి ‘‘బేబస్’’ (1950) సినిమా తీస్తున్నారు. విలన్‌గా నువ్వు వేయవచ్చు కదా’ అంటే అక్కడకు వెళ్లాడు. ఆ వేషం వలన శాంతారాం ‘‘సురంగ్’’ (1953)లో హీరో పాత్ర యిచ్చారు. ఆ సినిమా ఫ్లాపయినా అక్కణ్నుంచి వేషాలు వస్తూనే వున్నాయి. మొత్తం మీద 250 సినిమాల దాకా వేశాడు.
భరత్ భూషణ్ హీరోగా వేసిన ‘‘గేట్ వే ఆఫ్ ఇండియా’’, ‘‘బర్సాత్ కీ రాత్’’, ‘‘బసంత్ బహార్’’ వంటి సినిమాలలో పాత్రలు వేసి పేరు తెచ్చుకున్నాడు. ‘‘కాలీ టోపీ లాల్ రుమాల్’’ (1959) వంటి బి గ్రేడ్ సినిమాల్లో హీరో వేషాలు కూడా వచ్చాయి. ఆ వూపులోనే హెలెన్ హీరోయిన్‌గా, ఇక్బాల్ ఖురేషీ సంగీతదర్శకత్వంలో ‘‘చా చా. చా’’ (1964)అనే సినిమాను రచించి, దర్శకత్వం వహిస్తూ నిర్మించాడు. దీనిలో అప్పటికి కొత్తగా వచ్చిన నీరజ్ పాటలు బాగుంటాయి. వెస్టర్న్ డాన్స్‌పై వచ్చిన తొలి హిందీ సినిమా యిది. ఆ డాన్స్‌లో యుకె నుంచి పొందిన డిప్లోమా అతనికి అక్కరకు వచ్చింది.
హైదరాబాదీ అయిన ఉర్దూ కవి, తెలంగాణ పోరాట వీరుడు మఖ్దుం మొహియుద్దీన్ (హైదరాబాదులోని సిపిఐ కార్యాలయానికి ఆయన పేరే పెట్టారు) రాసిన పాట ‘ఇక్ చమేలీకే మండ్‌వే తలే’ పాటను యీ సినిమాలో ఉపయోగించుకున్నారు. ఆయన మఖ్దూం 1969లో పోయిన తర్వాత తీసిన ‘‘బాజార్’’ (1982)లో కూడా ఆయన పాటలు వాడుకున్నారు. ‘‘చా, చా, చా’’ బాగా ఆడడంతో ‘‘స్ట్రీట్ సింగర్’’ (1966) అనే మరో సినిమాను స్వీయదర్శకత్వంలో హస్రత్ జయపురి గీతాలతో, శంకర్ జైకిషన్ సంగీతంతో తీశాడు. దాని ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ వచ్చారు. 1968 తర్వాత అతనికి పెద్ద పాత్రలు రావడం మానేశాయి. అప్పుడు శక్తి సామంత అతన్ని ఒప్పించి ‘‘కటీ పతంగ్’’, ‘‘అజ్‌నబీ’’, మెహబూబా’’, ‘‘అలగ్ అలగ్’’ వంటి సినిమాల్లో కారెక్టరు పాత్రలు వేయించాడు. అలా 1971 నుంచి 1982 వరకు అతను అనేక సినిమాల్లో అలాటి పాత్రలు వేశాడు. తర్వాత ముసలి పాత్రలు వేస్తూ ‘‘ఖౌఫ్’’ (2000) సినిమాతో 78వ ఏట నటనకు గుడ్‌బై చెప్పాడు.
తన 50 ఏళ్ల వయసులో గుల్జార్ వద్ద అసిస్టెంటు డైరక్టరుగా చేరాడు చంద్రశేఖర్. ‘‘పరిచయ్’’, ‘‘కోశిశ్’’, ‘‘అచానక్’’, ‘‘ఆంధీ’’, ‘‘ఖుశ్‌బూ’’, ‘‘మౌసమ్’’ సినిమాలకు పనిచేశాడు. 65 ఏళ్ల వయసు వచ్చేసరికి 1987లో రామానంద సాగర్ టీవీకై తీసిన ‘‘రామాయణ్’’లో సుమంతుడి పాత్ర వేసి ఆ తరానికి కూడా పరిచితుడయ్యాడు. బిఆర్ చోప్డా తీసిన ‘‘మహాభారత్’’, ‘‘పరివర్తన్’’, ‘‘కమాండర్’’ సీరియల్స్‌లో కూడా నటించాడు. సినీ ఆర్టిస్ట్‌స్ అసోసియేషన్‌కు 1985 నుంచి 1996 వరకు ప్రెసిడెంటుగా వుండడంతో బాటు సినిమాకు సంబంధించిన అనేక సంస్థల్లో ఆఫీస్ బేరర్‌గా వున్నాడు. అతని కొడుకు టీవీ ప్రొడ్యూసర్, ఈవెంట్ మేనేజర్. మనుమడు శక్తి అరోడా యాక్టర్. హైదరాబాదు బిడ్డ హిందీ చిత్రసీమలో యింత సుదీర్ఘ కెరియర్ కలిగినందుకు తెలంగాణ ప్రభుత్వం 97 ఏళ్ల వయసున్న ఆయనకు ఏదైనా ఎవార్డు ప్రకటిస్తే బాగుంటుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)