మొత్తానికి థాంక్స్ టు సోషల్ మీడియా. టాలీవుడ్ జనాలను కదిలించింది. నటుడు సోనూ సూద్ చేస్తున్న కరోనా సాయాలను ప్రస్తావిస్తూ, టాలీవుడ్ జనాల్లో కదిలిక రావాలని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా తెగ హడావుడి చేసింది. అనేక పోస్టులు గట్టిగా చలామణీ చేసింది. ఆఖరికి ఆ కదలిక వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయాలు కూడా బయటకు తీసుకు రావడం ప్రారంభించారు. సుమారు 15లక్షల మేరకు సాయం చేసారంటూ మీడియాలోకి వదిలారు. మరోపక్కన సుకుమార్, సమంత ఇలా పలువురు ఎవరికి తోచిన సాయం వారు చేయడం ప్రారంభించారు.
ఇలాంటి నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఓ ఆక్సిజన్ బ్యాంక్ ను ప్రారంభించాలని మెగాస్టార్ ఓ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఏ సోషల్ మీడియా అయితే విమర్శించిందో అదే సోషల్ మీడియా శహభాష్ అంటోంది. రామ్ చరణ్ నేతృత్వంలో, మెగా ఫ్యాన్స్ ఎక్కడిక్కడ వీటిని నిర్వహిస్తారని ప్రకటించారు.
అసలు ఈ బ్యాంక్స్ కాన్సెప్ట్ ఏమిటో, విధివిధానాలు ఏమిటో అన్నది ప్రారంభం అయితే కానీ తెలియదు. ఆక్సిజన్ ను స్టోర్ చేసి, సిలెండర్లు రీఫిల్ చేసే విధంగా వీటిని ఏర్పాటు చేస్తారా? ఏమిటి అన్నది చూడాలి. అవి ఎలా వున్నా, జనాలకు సులువుగా ఆక్సిజన్ బ్యాంక్ అనేది ఒకటి అందుబాటులోకి వస్తే మంచి విషయమే.
భవిష్యత్ లో ఇక ఎలాగైనా ఆక్సిజన్ అవసరం జనాలకు పెరిగేలా వుంది. ప్రతి ఇంటా చిన్నదో, పెద్దదో ఆక్సిజన్ సిలెండర్ వుండాల్సిన రోజులు వచ్చేలా వున్నాయి చూస్తుంటే. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ప్రశంసనీయమే.