ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనబరిచిన ఆప్యాయతకు శాసన మండలి చైర్మన్ షరీఫ్ ఫిదా అయ్యారు. ఈయన టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. షరీఫ్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉభయ సభల సమావేశాల అనంతరం షరీఫ్‌నకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఎంతో మృధుస్వభావిగా పేరొందిన షరీఫ్ …మూడు రాజధానుల బిల్లులపై మండలిలో చర్చ సందర్భంగా తెరపైకి వచ్చారు. తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య నాడు బిల్లులను సెలెక్ట్ కమిటీకి చైర్మన్ పంపడం తీవ్ర వివాదాస్పదమైంది. చైర్మన్ నిర్ణయంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ఆదేశాలను పాటించారనే అపప్రదను మూటకట్టుకున్నారు.
ఇదిలా ఉండగా తన వీడ్కోలు కార్యక్రమంలో షరీఫ్ భావోద్వేగంతో మనసులో మాటను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన మాటను చెప్పాలనుకుంటున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూపిన ఆదరాభిమానాలను పదేపదే షరీఫ్ గుర్తు చేసుకుని ఎంతో ఆనందానికి లోనయ్యారు. అన్నా అని జగన్ తనను ఎంతో ఆప్యాయంగా పలకరించే వారన్నారు. షరీఫ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘నా మనసులో మాట చెప్పాలి. నేను రాజీనామా చేస్తే పోతుందని అనుకున్నా. రాజీనామా పత్రాన్ని కూడా రెడీ చేసుకున్నా. నేను ఇదే సీటుపై కూచుని దేవుని ప్రార్థించుకున్నాను. నేను చెడ్డ అనిపించుకోకుండా, నేను తీసుకునే నిర్ణయం ఇబ్బంది పడకుండా ఉండే రకంగా నా మనసులో సంకల్పం కల్పించాలని ప్రార్థన చేసుకుంటూ కూచున్నాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని తలచుకోవాల్సిన అవసరం ఉంది.
నేనే ఎక్కువ సహనశీలుడినని అనుకుంటున్నాను. కానీ నా కంటే ఎక్కువ సహనశీలుడు ఆయన. ఎందుకంటే మూడు రాజధానుల బిల్లుల విషయంలో ఏ రోజైతే సభలో గలాట జరిగిందో, మూడు రోజుల తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే నాడు హై టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో కలిసి కూచున్నాను.
చాలా ఆప్యాయతగా, చాలా గౌరవంగా ఎక్కడా కూడా కోపం, విసుగు లేకుండా … షరీఫ్ అన్నా మీరు చాలా కలత చెందారే అని అడిగారు. నన్ను ఎప్పుడు కూడా పదవితో పిలవలేదు. ఎప్పుడు కనిపించినా షరీఫ్ అన్నా అనే పిలుస్తారు.
ఆ రోజు ఎందుకు కలత చెందారు, ఎందుకు ఒత్తిడికి లోనయ్యారని నన్ను అడిగారు. ‘అన్నా మేము చిన్నోళ్లం. ఇంతకు ముందు ఏ పదవులు చేయలేదు. ఒక్కసారిగా ఎమ్మెల్సీ అయ్యాను. అనంతరం చైర్మన్ అయ్యాను. అందువల్ల ఒత్తిడికి గురై కలత చెందానని చెప్పాను ’. ఎక్కడా కూడా ఆయన మనసులో, ముఖ కవళికల్లో గానీ నా మీద కోపం, విసుగు లేకుండా షరీఫ్ అన్నా అనే మాట్లాడారు. ఇప్పుడు కూడా, ఈ రోజు కనపడ్డా అట్లే మాట్లాడ్తారు.
నన్ను అత్యంత గౌరవంగా చూసే సీఎం గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. 30 ఏళ్లుగా నన్ను రాజకీయంగా ప్రోత్సహించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నన్ను అన్నగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి కృతజ్ఞ తలు చెప్పుకుంటున్నా. అలాగే ముఖ్యంగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నాకు అత్యంత సన్నిహితులు.
పీఏసీ చైర్మన్‌గా రాజేంద్రనా థ్‌రెడ్డి ఉన్నప్పుడు నాపై చూపిన ఆదరాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేను ’ అని షరీఫ్ తీవ్ర భావోద్వేగానికి గురవుతూ తన మనసులో మాటను బయట పెట్టారు. టీడీపీ సీనియర్ నేతగా, మండలి చైర్మన్‌గా షరీఫ్ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తి జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించడంతో ముఖ్యమంత్రి గౌరవం రెట్టింపు అయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.