మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సిగ్గు లేకుండా ఏంటా మాటలు అని వెటకరిస్తున్నారు. పత్రికా ప్రకటనలు, ప్రెస్‌మీట్లతో నాయకుడిగా చెలామణి అవుతున్నాడీ ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత అని సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనపై అవాకులు చెవాకులు పేలుతున్నాడని ప్రత్యర్థులు యనమలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడేళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా? అక్రమార్జన తరలింపు కోసమా? అని యనమల ఇవాళ ప్రశ్నించారు. సొంత, రహస్య పనులకు ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఏంటని యనమల నిలదీశారు. దావోస్‌కు అధికార యంత్రాంగంతో కలిసి వెళ్లకుండా, ప్రత్యేక విమానానికి ఒక ఖర్చు, కమర్షియల్ ఫ్లైట్‌కు మరో ఖర్చు పెట్టడం వెనుక మర్మమేంటని యనమల ప్రశ్నించారు. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి ఇది అదనపు భారవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇవే ప్రశ్నలు మరే నాయకుడైనా అడిగి వుంటే అర్థం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖర్చుల వృథాపై ప్రశ్నించే నైతిక హక్కు యనమలకు ఎంత మాత్రం లేదని హితవు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 23, 2018లో చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన జీవోను నెటిజన్లు తెరపైకి తెచ్చారు.
నాడు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 2018, ఏప్రిల్ 12న సింగపూర్‌లోని అజురే డెంటల్ హాస్పిటల్‌లో రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్నారు. ఇందుకు రూ.2,88,823 ఖర్చైనట్లు బిల్లులు సమర్పించారు. వీటిని ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియాలో కేవలం 10-15 వేల రూపాయల్లో అయ్యే వైద్యానికి దాదాపు రూ.3 లక్షల ప్రభుత్వ ధనాన్ని చెల్లించడంపై నాడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రజాధనం ఖర్చు నీతులు చెప్పే మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమలా …నాడు రూట్ కెనాల్ వైద్యానికి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా వాడుకున్నప్పుడు గుర్తు రాలేదా? అని నెటిజన్లు నిలదీయడం విశేషం. యనమల మాటలతో టైం పాస్ చేస్తుండడం వల్లే తుని ప్రజలు ఓడించి పక్కన పెట్టారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గలేమని, ఎమ్మెల్సీతో సరిపెట్టుకుంటున్న యనమల కూడా నీతులు చెప్పడం… దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందనే ఘాటు విమర్శలు తెరపైకి వచ్చాయి.