ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల బడ్జెట్ వచ్చేసింది. సంక్షేమమే లక్ష్యంగా దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మరోసారి పేదల ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ, వాళ్ల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ లో నిధులు కేటాయించారు. కేటాయింపుల్లో జగన్ నవరత్నాలు మరోసారి కళకళలాడాయి.
గత ఆర్థిక సంవత్సరం 2,24,789 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన జగన్ సర్కారు, ఈసారి కేటాయింపుల్ని ఇంకాస్త పెంచింది. ఏకంగా 2,29,779 కోట్ల రూపాయలతో అంచనాలు ప్రవేశపెట్టింది.
ఎక్కువ కేటాయింపుల్ని పథకాలకే కేటాయిస్తూ జగన్ తన పెద్ద మనసు చాటుకున్నారు. మరీ ముఖ్యంగా కులాల ప్రాతిపదికన చూసుకుంటే.. గతేడాదితో పోలిస్తే, ఈసారి వెనుకబడిన కులాలకు బడ్జెట్ లో 32 శాతం అధికంగా కేటాయింపులిచ్చారు.
కాపు సంక్షేమానికి 7 శాతం అదనంగా నిధులు కేటాయిస్తూ, ఏకంగా 3306 కోట్ల రూపాయల్ని కేటాయించారు. అటు బ్రాహ్మణుల సంక్షేమం కోసం చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో 189శాతం అధికంగా కేటాయింపులిచ్చారు. ఇక ఎస్సీ సబ్-ప్లాన్ లో 22 శాతం, ఎస్టీ సబ్ ప్లాన్ లో 27శాతం, ఈబీసీ సంక్షేమానికి 8 శాత అదనంగా నిధులు కేటాయించి తన పెద్ద మనసు చాటుకుంది జగన్ సర్కార్.
వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న జగన్ సర్కార్.. ఆ దిశగా భారీగా కేటాయింపులు చేసింది. వ్యవసాయానికి 11,210 కోట్లు, విద్యకు 24,624 కోట్లు, వైద్యానికి 13,830 కోట్లు కేటాయించింది.
ఇక నేరుగా నగదు బదిలీ చేసే పథకాలకు కూడా భారీగా కేటాయింపులు జరిగాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతుభరోసా, జగనన్న విద్యాదీవెన-వసతి దీవెన, సున్నా వడ్డీ కింద ఇచ్చే డ్వాక్రా రుణాలు, కాపునేస్తం, జగనన్న చేదోడు, వాహనమిత్ర, మత్స్యకార భరోసా, అమ్మ ఒడి లాంటి కార్యక్రమాలకు గతేడాది కంటే ఎక్కువ కేటాయింపులిచ్చారు జగన్. ఇలా అన్ని వర్గాల వారిని సంతృప్తిపరుస్తూ, సంక్షేమం అందేలా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జగన్, ఆ దిశగా బడ్జెట్ లో భారీ కేటాయింపులిచ్చారు. నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల ఆధునీకరణ కోసం ఈసారి ఏకంగా 3500 కోట్ల రూపాయల్ని కేటాయించారు. ఇక గోరుముద్ద కోసం 1200 కోట్లు, విద్యాకానుక కోసం 750 కోట్లు కేటాయించారు.
అటు ఆస్పత్రుల రూపురేఖలు మార్చేందుకు ఈ ఆర్థిక సంవత్సరం అత్యథికంగా 1535 కోట్లు కేటాయించారు. ఈ నిధుల ద్వారా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయల్ని భారీగా కల్పించబోతున్నారు. ఇక కరోనాపై పోరాటం కోసం వెయ్యి కోట్ల నిధులు కేటాయించిన జగన్ సర్కార్.. ఆరోగ్య శ్రీ, ఔషధాల కొనుగోలు కోసం 2248 కోట్ల రూపాయలు వెచ్చించబోతోంది.
ఓవరాల్ గా చూసుకుంటే, గతేడాదిలానే ఈసారి కూడా బడ్జెట్ లో సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత విద్య-వైద్య రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. తాజా బడ్జెట్ తో తను మరోసారి ప్రజల మనిషినని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి జగన్.