ఇప్పటికే కర్ణాటకలో కరోనా వైరస్ జాడ కనిపించింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు కరోనా ప్రభావంతో మరణించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. వారం రోజుల పాటు అన్నీ బంద్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు నిన్నటి ఆదివారం నుంచి బెంగళూరులో ప్రధాన షాపింగ్ మాల్స్, థియేటర్లు, కొన్ని ఆఫీసులు మూత పడ్డాయి. అయితే కూడా పూర్తిగా కాదు.
మామూలు షాపులు యథావిధిగా ఓపెన్ అయ్యాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కొనసాగుతూ ఉంది. కేవలం హై క్లాస్ మాల్స్, మల్టీప్లెక్స్, బార్లు, పబ్బులు మాత్రమే మూతపడినట్టుగా తెలుస్తోంది. ఇక చిన్న చిన్న సూపర్ మార్కెట్లూ గట్రా ఓపెన్ లోనే ఉన్నాయి. స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఇచ్చాయి ఉద్యోగులకు. అయితే గమనించాల్సిందంతా ఏమిటంటే.. వారం రోజులు మాత్రమే ఈ అలర్ట్ కూడా.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ఆదివారం నుంచి మళ్లీ శనివారం వరకూ బంద్ పాటించాల్సిన వాళ్లు పాటిస్తారు. ఆ తర్వాత సంగతి ఆ తర్వాత తేలుస్తారు. కరోనా కేసులు గుర్తించి, ఆ వైరస్ ప్రభావంతో ఇద్దరు వ్యక్తులు మరణించిన రాష్ట్రంలో కూడా అలర్ట్ ప్రకటించింది వారం రోజులు మాత్రమే. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవచ్చు.
అయితే కరోనా ప్రభావం జీరో స్థాయిలో ఉన్న ఏపీలో మాత్రం.. ఏకంగా ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసేశారు! అది కూడా ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా! ఎన్నికలను ఏ వారం రోజులో వాయిదా వేశారంటే.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావింవచ్చు. అయితే కర్ణాటకతో పోల్చినా కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ఏపీలో మాత్రం మరో మాటే లేకుండా ఆరు వారాల వాయిదా.. ఏమిటో అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇదంతా కుట్రపూరితమే అనేందుకు చాలా లాజిక్ లే కనిపిస్తూ ఉన్నాయని అంటున్నారు.