నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చిత్తూరు జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలకు కొరకరాని కొయ్యగా మారారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రాష్ట్రంలోని 174 నియోజకవర్గాలకు భిన్నంగా రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరిలో సాగుతోంది. నగరి సమీప నియోజకవర్గాల్లో 80-90 శాతం ఏకగ్రీవాలైనా…నగరిలో మాత్రం మహా అయితే నియోజకవర్గమంతా కలిపినా ఆరేడు ఎంపీటీసీ స్థానాలకు మించి ఏకగ్రీవం కాలేదు.
అందువల్లే ఆ నియోజకవర్గంపై చిత్తూరు జిల్లాలో ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. నగరి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య పోటీ జరగడం లేదు. ఆ నియోజకవర్గంలో రోజా వర్సెస్ చిత్తూరు జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఎప్పటి నుంచో వైసీపీలో కొనసాగుతున్న నాయకులు ఒకొక్కరుగా రోజాకు దూరమయ్యారు. కానీ వాళ్లంతా వైసీపీలోనే కొనసాగుతుండటం గమనార్హం.
పుత్తూరు మున్సిపాలిటీలో డీఎన్ ఏలుమలై అలియాస్ అమ్ములు, నగరిలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కేజే శాంతకుమారి, ఆమె భర్త కుమార్ మొదటి నుంచి వైసీపీలో బలమైన నాయకులుగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వీళ్లు తన ఓటమి కోసం పనిచేశారని ఎమ్మెల్యే రోజా అనుమానమే కాదు ఆరోపణ కూడా. అంతేకాకుండా వీళ్లను పక్కన పెట్టడంతో పాటు టీడీపీ నేతలందరినీ రోజా చేర్చుకున్నారు.
తాజాగా స్థానిక ఎన్నికల విషయానికి వస్తే నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో విజయపురంలో ఒక ఎంపీటీసీ, నిండ్రలో ఒకటి, నగరిలో ఒకటి, వడమాలపేటపేటలో రెండుమూడు స్థానాల్లో మాత్రమే వైసీపీ ఏకగ్రీవం చేసుకోగలిగింది. ఏలుమలై బీసీల్లో బలమైన నాయకుడు. అలాగే నగరిలో కేజే కుమార్కు బలమైన కేడర్ ఉంది. దీంతో పుత్తూరు, నగరిలో ఆ ఇద్దరు నాయకులు తమ స్థానిక బలంతో అభ్యర్థులను బరిలో నిలిపారు. వీళ్లకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి ఆశీస్సులు మెండుగా ఉన్నాయనడంలో ఎలాంటి అనుమానం లేదు.
గత నెలలో కేజే కుమార్ పుట్టిన రోజు వేడుకకు మంత్రులు రావాల్సి ఉండింది. అయితే చివరి నిమిషంలో కార్యక్రమం రద్దైంది. ఈ నేపథ్యంలో వారం క్రితం కేజే కుమార్ ఇంటికి మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి వెళ్లడం, వాళ్లకు దంపతులిద్దరూ పాదాభివందనం చేయడం, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చకాచకా జరిగిపోయాయి.
ఈ వ్యవహారం రోజాకు పుండుమీద కారెం చల్లినట్టైంది. ఎందుకంటే గత నెలలో కేజే కుమార్ పుట్టిన రోజు వేడుకకు వెళ్లే వారెవరైనా తన వాళ్లు కాదని, అలా వెళ్లిన వాళ్లను దూరం పెడతానని ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా మంత్రులే కేజే కుమార్ ఇంటికి వెళ్లి ఆశీస్సులు అందించడంతో రోజా ఫైర్ అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నగరిలో మొక్కుబడిగా ఏకగ్రీవాలు కావడం, మరోవైపు సొంత పార్టీ వాళ్లే ప్రత్యర్థులుగా బరిలో దిగడంతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయ్యింది.
ఆ మధ్య చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్తో పాటు పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి కూడా నగరి విషయమై రోజాతో చర్చించారని సమాచారం. మంత్రులతో పాటు జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలను కలుపుకు పోవాలని రోజాకు సూచించినా…ప్రయోజనం లేదని సమాచారం. మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి కూడా పంతానికి పోయినట్టు తెలిసింది. రోజా వ్యతిరేకిస్తున్న వాళ్లను మంత్రులిద్దరూ ప్రోత్సహిస్తున్నారనే టాక్ నగరిలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆందోళన వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఉంది.