ఏపీలో స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేసిన ఈసీ ఇప్పుడు సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికలు ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం జరగకపోతే.. దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు కేంద్రం నుంచి వచ్చే అవకాశాలు ఉండవు. ఈ నేపథ్యంలో ఎన్నికల వాయిదా సర్వత్రా ఆందోళనకు కారణం అవుతూ ఉంది.
ఇప్పటికే ఈ నిర్ణయం పై సుప్రీం కోర్టుకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. మరోవైపు ఏపీ సీఎస్ నుంచి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు లేఖ కూడా వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఏపీలో కరోనా వైరస్ పరిస్థితి గురించి అడిగి ఉంటే తాము పూర్తి వివరాలను ఇచ్చే వాళ్లమని అందులో పేర్కొన్నారట. అలాగే ఎన్నికలను యథాతథంగా నిర్వహించాలని కూడా కోరినట్టుగా సమాచారం.
ఎన్నికల వాయిదా గురించి ఇప్పటికే ఈసీ తీరుపై గవర్నర్ విశ్వభూషణ్ కు ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఈసీ వెళ్లి గవర్నర్ తో సమావేశం కాబోతున్నట్టుగా సమాచారం. ఈ భేటీ తర్వాత ఈసీ ఏం చెబుతారనేది ఆసక్తిదాయకంగా మారింది. సోమవారం ఉదయమే ఆ భేటీ జరగబోతూ ఉండటం గమనార్హం.
మరోవైపు ఏపీలో కరోనా ప్రభావం గురించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈసీ ఎలాంటి వాకబూ చేయలేదని స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలంటే సీఎస్ నో, ఆరోగ్యశాఖ అధికారులనో అడగాలి.. అయితే ఈసీ అలాంటి పనే చేయలేదని స్పష్టం అవుతోంది. అయితే తాము కేంద్ర అధికారులను సంప్రదించినట్టుగా చెబుతోందట ఈసీ!