స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయం ఏపీలో తీవ్ర వివాదాస్పదమవుతోంది. దీనిపై పాలక ప్రతిపక్ష పార్టీలు పరస్పసరం దూషణలకు దిగుతున్నాయి. ప్రజాస్వామ్యం మనుగడపై చర్చ తీవ్ర దుమారం రేపుతోంది. తాము అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే చెరపట్టిన వాళ్లు…నేడు ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా తయారైంది.
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకూ ఆయన స్థానిక ఎన్నికలపై ఏమన్నారంటే…
– ఇది కేవలం నిలిపివేత మాత్రమే. ఎన్నికల రద్దు కాదు. ఆరు వారాల తర్వాత, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత.. నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ పున:ప్రారంభం అవుతుంది. ఇప్పటిదాకా జరిగిన ప్రక్రియ రద్దు కాదు.
– ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు. ఎన్నికలు పూర్తి కాగానే మిగిలిన సభ్యులతోపాటు వీరు కూడా బాధ్యతలు చేపడతారు. వారికి ఎలాంటి నష్టం వాటిల్లదు. ఆరు వారాల తర్వాత సమీక్ష అనంతరం వాయిదా పడిన ఎన్నికల కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
– జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాల్టీలకు ఇదివరకే విడుదల చేసిన నోటిఫికేషన్లను అవసరమైన చోట సవరిస్తాం.
-నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలు చింపివేయడం వంటి సంఘటనలు పెద్దఎత్తున జరిగినట్లు నిర్ధారించిన తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తున్నాం. వాటిలో అవసరమైనచోట కొత్త షెడ్యూల్‌ను ప్రకటించడానికి వెనుకాడం.
ఎన్నికల వాయిదా ప్రకటన, జగన్ ప్రెస్‌మీట్ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఎన్నికల జరిగే విధానం ఇదా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. అలాగే పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. మంత్రి పదవికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనర్హుడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సారి చిత్తూరు జిల్లాలో 14 స్థానాల్లో తామే గెలుపొంది వైసీపీ నేతలకు బుద్ధి చెబుతామని హెచ్చరించాడు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఆగడాలకు సంబంధించి తమ దగ్గర వీడియోలతో సహా ఆధారాలున్నాయి. కోర్టుకెళ్లి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించాడు.
ఒక వైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తిరుపతి, పుంగనూరు, మాచర్లలో ఘటనపై తీవ్రంగా స్నందిస్తూ….అన్నీ పరిశీలించి అవసరమైతే రీషెడ్యూల్ ఇస్తామని ప్రకటించాడు. మరోవైపు చంద్రబాబు తమ దగ్గర వీడియో ఆధారాలున్నాయని చెబుతున్నాడు. అంతేకాకుండా రెండురోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘానికి వాతలు పెట్టిన నేపథ్యంలో ఆ మూడు చోట్ల రీషెడ్యూల్ వైపే మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. మున్ముందు ఈ ఎన్నికలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి మరి.