ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకు పోతున్నా…ఎన్నికలను వాయిదా వేయించి సీఎం జగన్ ఇగోను దెబ్బకొట్టాననే ఆనందాన్ని దక్కించుకున్నాడు. స్థానిక సంస్థల వాయిదాకు బాబు వివిధ రకాల ఎత్తుగడలు వేశారు. చివరికి ప్లాన్-బీతో ఆయన సక్సెస్ సాధించాడు.
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను బాబు వాయిదా వేస్తూ వచ్చాడు. దీనికి కారణం ప్రజావ్యతిరేకత బయట పడితే…సార్వత్రిక ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతింటామని అప్పట్లో బాబు భయాందోళనకు గురయ్యాడు. దీంతో ఏవేవో సాకులు చూపి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశాడు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని బాబు మూట కట్టుకున్నాడు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సుమారు రూ.5 వేల కోట్లు మరుగున పడుతాయనే ఆందోళనతో జగన్ సర్కార్ సీరియస్‌గా ఆలోచించింది.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపు 60 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికతో ముందుకెళ్లింది. అయితే బీసీలకు 34% రిజర్వేషన్ కుదరదంటూ టీడీపీ నేతతో బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ కేసు తిరిగి హైకోర్టు చేరింది. హైకోర్టు సమగ్ర విచారణ నిర్వహించి 50% మించి రిజర్వేషన్లు కుదరదని తేల్చి చెప్పడంతో…బీసీలకు 34 శాతానికి బదులు 24%కు కుదించి ఈ నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించేందుకు జగన్ సర్కార్ సమాయత్తమైంది.
అయితే టీడీపీ కుట్రల వల్ల బీసీలు పోగొట్టుకున్న పది శాతం రిజర్వేషన్లను పార్టీ తరపున ఇస్తామని సీఎం జగన్ ప్రకటించాడు. దీంతో చంద్రబాబుకు బీసీల్లో బాగా డ్యామేజీ జరిగింది. దీన్ని పసిగట్టిన బాబు ఎలాగైనా ఎన్నికలు వాయిదా వేయించాలనే తన కుట్రలను కొనసాగించాడు. ఈ దఫా మళ్లీ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కుదింపును తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం..మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతేడాది డిసెంబరు 28న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 176ను హైకోర్టు రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చట్టవిరుద్ధమని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు, మాజీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జీవో 176 ప్రకారమే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్లను 24.42 శాతానికి తగ్గించారని పేర్కొన్నారు. తమ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వచ్చి…ఎన్నికలు వాయిదా పడుతాయని టీడీపీ ఆశించినా ఫలితం లేకపోయింది. అంటే ప్లాన్-ఎ విఫలమైంది.
అయితే బాబు ఇంకో రకంగా స్థానిక ఎన్నికలకు స్పాట్ పెట్టాడు. అదే ప్లాన్-బీ. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు ఆయన మొదటి నుంచి గట్టిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాడు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని టీడీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్నికలకు ఇంత తక్కువ కాల వ్యవధి ఏంటని స్వయంగా బాబూనే నిలదీశాడు. ఇంత హడావుడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించాడు.
అయినా ఎన్నికల ప్రక్రియ సాఫీగానే సాగిపోతూ వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో పాటు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు అయ్యాయి. ఇవ్వన్నీ అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఓ సంచలన నిర్ణయం. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రకటించారు. దీనిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవర్ని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన నిలదీశాడు. చంద్రబాబు హయాంలో నియమితులు కావడంతో పాటు ఆయన సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడం వల్లే రాష్ట్రాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగా బాబు ఒత్తిళ్లకు లొంగి ఇలాంటి అప్రజాస్వామిక నిర్ణయం తీసుకున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకుండా చేసి, 14వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా అడ్డుకుని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోకాలడ్డుతున్నారని సీఎం ఫైర్ అయ్యారు.
చివరికి ఎన్నికల వాయిదా వేయాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న బాబు అనుకున్నదే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కూడా చేశాడు. ప్లాన్-బీతో స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు అడ్డుకుని తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. అంతిమంగా ప్రజలే నష్టపోవాల్సి వచ్చింది.