జూలైలోగా రోడ్లపైన గోతులుండవని జగన్ చెప్పాడు. చాలా సంతోషం. గోతిలో పడిన వాళ్లకి తెలుస్తుంది గొయ్యి అంటే ఏంటో. రోడ్డు మీద గోతులుంటే OK, గొయ్యికి గొయ్యికి మధ్య రోడ్డు ఉంటేనే సమస్య. గొయ్యి ఈనాటిది కాదు. మానవ జీవితంలో గోతికి ఎంతో పాత్ర వుంది.
ఒకరికొకరు గోతులు తీసుకుంటే చివరికి ఇద్దరూ గోతిలోనే వుంటామని సామెత. జిత్తులమారి వాన్ని గోతులు తీసే రకం అంటారు. నమ్మించి గోతిలో తోసేవాళ్లు అడుగడుగునా వుంటారు. వాళ్లు స్నేహితులు, బంధువుల రూపంలో వుంటారు. NTR అంతటి వాడు చంద్రబాబు తీసిన గోతిలో పడ్డాడు. అయితే అది గొయ్యి కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటాయి ఆయన భజన బృందాలు. గొయ్యి కూడా చూసేవాళ్ల కళ్లని బట్టి వుంటుంది.
జగన్‌కి గొయ్యి తీయడం అంత సులభం కాదు. ఆయన ఎవరినీ నమ్మడు. జీవితంలోని గోతుల్ని పక్కన పెట్టి, నిజమైన గోతుల గురించి మాట్లాడుకుందాం.
ఇపుడైతే ఫోర్‌లైన్ రోడ్లకి అలవాటు పడ్డాం కానీ, ఒకప్పుడు రోడ్డు అంటే వందలాది గోతులు. అందులో రకరకాల సైజలుంటాయి. చిన్న గోతులకి సైకిల్ కిరకిరమనేది. పెద్ద గోతులకి సైకిల్‌తో పాటు వెన్నుపూస కిరిక్మనేది. ఇంకా పెద్ద గోతులుంటాయి. పడితే పడడమే. మళ్లీ అంత సులభంగా లేవం.
1970-80 నాటికి మంచిరోడ్డు మన ఊహకి కూడా అందదు. తారురోడ్లన్నీ కంకర తేలి, మట్టి రోడ్లు గొయ్యి టుది పవర్ ఆఫ్ గొయ్యిలా వుండేది. రోడ్డు పక్కన కంకర తోలిన ఏడాదికి రోడ్డు వేసేవాళ్లు. అయితే అప్పట్లో ఇన్ని వాహనాలు లేవు. పల్లెటూళ్లలో సైకిళ్లు, ఎడ్ల బళ్లు. మెయిన్‌రోడ్డు మీద లారీలు, బస్సులు తిరిగేవి. కార్లు ,టూవీలర్ల సంఖ్య చాలా తక్కువ. ఆటోలు పెద్ద వూళ్లలో తప్ప కనపడేవి కాదు.
ఇక బస్సులు ఈ బ్రహ్మాండమైన రోడ్ల మీద 30 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటలు ప్రయాణం చేసేవి. వెనుక సీట్లలో కూచున్న వాళ్లు గాలిలోకి లేచి మళ్లీ సీట్లలో కూచునేవాళ్లు. గోతుల్లోకి చక్రాలు దిగినప్పుడల్లా బస్సు భూకంపం వచ్చినట్టు అటూఇటూ ఊగేది. మనుషులు ఒకరి మీద ఇంకొకరు పడి సర్దుకునే వాళ్లు. తెల్ల బట్టలతో బస్సు ఎక్కిన వాళ్లు, ఎర్రబట్టలతో దిగేవాళ్లు. అంత దుమ్ము. డ్రైవర్లు దుమ్ము లేపితే, జనం దుమ్ము దులుపుకునే వాళ్లు.
ఈ గోల ఒక ఎత్తు అయితే, కొన్ని బస్సులు గోతిలోకి దిగితే బయటికి రావడానికి ఇష్టపడేవి కావు. జనమంతా దిగి తోసేవాళ్లు. గొయ్యి మన నాగరికతకి చిహ్నం.
ఆధునిక భాషలో గోతులు తీయడాన్ని పబ్లిక్ రిలేషన్స్ అని కూడా అంటారు.
జీఆర్ మహర్షి