ఉప రాష్ట్రపతి హోదాలోని వ్యక్తికి రాష్ట్రపతిగా ప్రమోషన్ ఇచ్చిన సందర్భాలు దేశ చరిత్రలో పరిమితంగానే ఉన్నాయి. ఉపరాష్ట్రపతిగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న వెంటనే, రాష్ట్రపతిగా ప్రమోషన్ పొందిన ఘనత అరుదైనది.
గతంలో యూపీఏ హయాంలో ఉపరాష్ట్రపతికి రెండు పర్యాయాలూ కొనసాగింపును ఇచ్చినట్టుగా ఉన్నారు. ప్రమోషన్ అయితే ఇవ్వలేదు.
ఇక కమలం పార్టీకి కూడా ప్రస్తుత ఉప రాష్ట్రపతికి రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చే ఆలోచన ఉన్నట్టుగా వార్తలు మొదటి నుంచి రాలేదు! గిరిజన లేదా ఎస్సీ కాదంటే ముస్లిం అభ్యర్థికి బీజేపీ వాళ్లు రాష్ట్రపతిగా ఈ సారి అవకాశం ఇవ్వనున్నారనే మాట ప్రముఖంగా వినిపించింది.
తెరపైకి వచ్చిన పేర్లన్నీ ఆ కోటా లోవే! వారిలో ఎవరో తేల్చుకోవడానికి మాత్రం బీజేపీ సమయం తీసుకున్నట్టుగా ఉంది.
మరి ఈ సందడిలో తెలుగు మీడియా తనదైన అతిని చేసింది. ఆఖరి గంటల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరును రాష్ట్రపతి అభ్యర్థి అంటూ హడావుడి చేసింది.
వెంకయ్య నాయుడు ఇంటికి బీజేపీ ముఖ్య నేతలు వెళ్లారని.. వారంతా రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండమంటూ ఆయనను కోరినట్టుగా తెలుగు మీడియా ప్రచారం మొదలుపెట్టింది.
వారికి మోడీ చెప్పి పంపించి ఉండవచ్చన్నట్టుగా హడావుడి చేసింది. ఇన్నాళ్లుగా వినిపించని పేరును బీజేపీ అధికారిక ప్రకటన వచ్చే ముందు హడావుడిగా తెరపైకి తెచ్చారు.
తెలుగు మీడియా ఇలా వెంకయ్య పేరును ప్రచారం తెచ్చినంతలోనే కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి ద్రౌపది ముర్ము అంటూ ప్రకటించేశారు.