అభ్యర్థి దొరక్క ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో తర్జనభర్జనలు పడగా… అధికార పక్షం మాత్రం అభ్యర్థి ఎవరో తేల్చుకోవడానికి చాలా సమయమే తీసుకుంది.
అనేక పేర్లు, అనేక సమీకరణాలు, అనేక సమావేశాలు… ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో వార్తల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకూ రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని కమలం పార్టీ ప్రకటించింది. ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా.
చాన్నాళ్లుగా వినిపిస్తున్న పేరే ఇది. ఈ దఫా గిరిజనులకు బీజేపీ అవకాశం ఇవ్వనుందని అందులో భాగంగా ద్రౌపది ముర్ముకు అవకాశం దక్కనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇవి అనేక మలుపులు తిరిగాయి! బీజేపీ వైపు ఉన్న ముస్లిం నేతల పేర్లు కూడా వినిపించాయి.
అనేక చర్చోపచర్చల అనంతరం.. కమలం పార్టీ ముఖ్య నేతలు మొదట్లోనే ప్రస్తావనకు వచ్చిన అభ్యర్థి వైపే మొగ్గు చూపినట్టుగా ఉన్నారు. అధికారికంగా అభ్యర్థి పేరును ఖరారు చేశారు.
ఇక విపక్ష పార్టీల తరఫున ఒకప్పటి బీజేపీ ముఖ్యనేత యశ్వంత్ సిన్హా పేరు ఖరారు అయిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల కిందట టీఎంసీ సభ్యత్వం తీసుకున్న సిన్హా ఆ పార్టీకి రాజీనామా చేసి, రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేపీకి 48శాతం ఓట్ల అనుకూలత ఉంది. ఎన్డీయేతర పక్షాల ఓటు బ్యాంకు 52 శాతంగా ఉంది. అయినప్పటికీ… బీజేపీ అభ్యర్థి విజయం లాంఛనమే అనుకోవాలి.