ఒకవైపు రాజకీయాలు విలువల దిశగా పురోగమించడం గురించి, ప్రజాస్వామ్యం గొప్ప భావనల దారిన పయనించడం గురించి ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ అనేక పర్యాయాలు చెబుతూ ఉంటారు! ప్రజాస్వామ్యం పురోగమించడం గురించి మోడీ ప్రవచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా సాగాలో గత కొన్నేళ్లలో మోడీ మినహా మరొకరు ప్రవచనాలు చెప్పడం లేదు కూడా!
మరి ప్రజాస్వామ్యం, దాని భావనలు, దాని గొప్పదనం, అది సాగాల్సిన తీరు గురించి మోడీ అలా చెబుతూ ఉంటారు కానీ, బీజేపీ రాజకీయం మాత్రం అనేక రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య యుతంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చడంలో బిజీగా ఉంటాయి.
ఇక ప్రజాస్వామ్యం గొప్పగా ఉండాలనే మోడీ జీ … ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఆ రాష్ట్ర పర్యటనలు వరస పెట్టి పెట్టుకోవడం కూడా కొత్త కాదు. కనీసం ఏడాది ముందే.. మోడీ పర్యటనలు అన్నీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రం చుట్టూరానే సాగుతూ ఉంటాయి. బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల చుట్టూ అయితే ఆ రాష్ట్రాల్లో ఎన్నికలకు ఏడాది ముందు నుంచినే మోడీ అనేక దఫాలుగా పర్యటనలు చేపట్టారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం, ఆ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు ఎడాపెడా శంకుస్థాపనలు చేయడం ఇదంతా కూడా కొత్త కాదు!
ఈ క్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోడీ కర్ణాటకలోని మైసూరు నగరంలో యోగసనాలు వేయడం కూడా ఈ తరహా రాజకీయం లాగానే ఉంది. వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మోడీ దృష్టి ఇప్పుడు కర్ణాటక మీద పడినట్టుగా ఉంది.
కర్ణాటకలో తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి చాలా ప్రతిష్టాత్మకమైన వ్యవహారం. ఇలాంటి నేపథ్యంలో.. మోడీ మైసూరులో యోగాసనాలు వేశారనుకోవచ్చు. ఇక నుంచి వరస పెట్టి మోడీ కర్ణాటక పర్యటనలు కూడా చేపట్టే అవకాశాలున్నాయి. ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రం మరి!