ఇప్పటికే ప్రభుత్వాలను కూల్చడంలో తమకు ఉన్న ప్రావీణ్యం గురించి కమలం పార్టీ చాటుకుంది. ఈ పరంపరలో కర్ణాటక, మధ్యప్రదేశ్ ల తర్వాత బీజేపీ కన్ను మహారాష్ట్రపై ఉందనేది చాన్నాళ్లుగా చర్చలో ఉన్న అంశమే. ఈ క్రమంలో మహారాష్ట్రలోనూ ముసలం బయల్దేరడం పెద్ద విచిత్రం కాదు.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రభుత్వం పతనావస్థలో కనిపిస్తూ ఉంది. శివసేన మంత్రి ఏక్ నాథ్ షిండే మొత్తం 21 మంది ఎమ్మెల్యేలతో గుజరాత్ క్యాంపులో తలదాచుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే తన బలం 21 కాదని, 35 మంది సేన ఎమ్మెల్యేలతో తను పార్టీని చీల్చడానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టుగా షిండే ప్రకటించారట. అయితే ఒకవేళ కాంగ్రెస్, ఎన్సీపీలతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేట్టు అయితే తను శివసేనను చీల్చనంటూ ఆయన ప్రకటిస్తున్నాడట!
తమకు బాల్ ఠాక్రే హిందుత్వవాదాన్ని నేర్పాడని, ఆ మేరకే తన తిరుగుబాటు ఉందన్నట్టుగా షిండే సమర్థించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ షిండే బలం 21కే పరిమితం అయినా.. ఠాక్రే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశమే. 21 మంది శివసేన ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తే.. మిగతా పనిని పూర్తి చేయడం బీజేపీకి పెద్దది కాకపోవచ్చు.
అయితే శివసేన ఈ వ్యవహారాన్ని ఇంత తేలికగా వదిలేస్తుందా? అనేది అసలైన వ్యవహారం. తిరుగుబాటు ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రంలో దాక్కొని కథను నడిపించడం తేలిక కాదు. ఒక వేళ అక్కడ ఉన్నది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే అయి ఉంటే బీజేపీ ఆటలు తేలికగా సాగేవేమో. పార్టీ పట్ల శివసైనికులు చాలా విధేయతతో ఉంటారు.
అలాగే శరద్ పవార్ లాంటి రాజకీయ ప్రావీణ్యుడు ఆ ప్రభుత్వానికి మార్గదర్శి స్థాయిలో ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో.. మరాఠా రాజకీయం రసవత్తరంగా మారుతోంది.