కారణాలు ఏవైతేనేం స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తానికి మొత్తం వాయిదా పడ్డాయి. ఈ అనూహ్య పరిణామాలు ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెబుతున్నట్టు కరోనాతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నామనడం శుద్ధ అబద్ధమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా కొందరు మేధావులు, రాజకీయ విశ్లేషకులు పలు అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 7న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 21న ఏక కాలంలో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 23న, అలాగే పంచాయతీలకు రెండు దశల్లో అంటే…27, 29వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 9న నామినేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్లలో భారీగా ఏకగ్రీవాలు అయ్యాయి. అలాగే ప్రతి జిల్లాలోనూ టీడీపీ బలమైన నాయకులు వైసీపీలో చేరడం ప్రారంభించారు. దీంతో టీడీపీకి కనీసం నామినేషన్లు వేసే దిక్కు కూడా లేకపోయింది. ఈ పరిణామాలు సహజంగానే టీడీపీ అధినేత చంద్రబాబులో ఆందోళన రేకెత్తించాయి. టీడీపీ ఖాళీ అయిపోతోందనే ప్రచారం ఊపందుకొంది. కనీసం పార్టీలో ఉన్న కేడర్‌నైనా కాపాడుకునేందుకు బాబు ఎత్తుగడ వేశారు.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగం, పంచాయతీరాజ్ చట్టం ద్వారా తనకు సంక్రమించిన విస్తృత, విచక్షణాధికారాల మేరకు నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికలను 6 వారాలపాటు నిలుపుదల(వాయిదా) చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
ఇక్కడే ఎన్నికల కమిషనర్ తన పక్షపాత ధోరణి బట్టబయలైంది. కరోనాపై అనుమానాలు, భయాలు ఉన్నప్పుడే పది రోజుల క్రితం ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేశారు? పది రోజుల క్రితానికి, ఇప్పటికి రాష్ట్రంలో కరోనా కేసుల నమోదులో వ్యత్యాసం ఏంటి? మరి కరోనా అంత తీవ్రంగా ఉంటే దేశ వ్యాప్తంగా ఖాళీ అయిన 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారు? ఈ నెల 6న రాజ్యసభ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారు?
ఎన్నిక అనివార్యమైతే ఈ నెల 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎలా నిర్ణయం తీసుకొంది? ఒకవైపు రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుంటే….మన రాష్ట్రంలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనుక ఎన్నికల కమిషనర్‌లో ‘హైరానా’ ఎందుకు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల రూపంలో వైసీపీ సత్తా చూపుతుంటే ఎన్నికల కమిషనర్‌కు ఎందుకంత ఆందోళన? స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు కరోనా కారణం కాదని, కేవలం ఆ అధికారి హైరానా మాత్రమే అంటే ఏం చెబుతారు? ఇలాంటి బోలెడు ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులు, మేధావులు, విద్యావంతులు, పౌర సమాజం నుంచి వస్తున్నాయి. వీటికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.