ఎమ్బీయస్‌ : చేతులెత్తేసిన చంద్ర‌న్న‌

ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎప్పుడూ మళ్లీ ఎన్నికలు రావాలని ఉవ్విళ్లూరుతూంటుంది. ఎన్నికలు జరిగిన మర్నాటి నుంచీ అధికార పార్టీని ఉద్దేశించి ‘మీకు ఓటేసినందుకు ఓటర్లు పశ్చాత్తాప పడుతున్నారు. అవకాశం వస్తే సవరించు కుందామనుకుంటున్నారు.’ అని…

ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎప్పుడూ మళ్లీ ఎన్నికలు రావాలని ఉవ్విళ్లూరుతూంటుంది. ఎన్నికలు జరిగిన మర్నాటి నుంచీ అధికార పార్టీని ఉద్దేశించి ‘మీకు ఓటేసినందుకు ఓటర్లు పశ్చాత్తాప పడుతున్నారు. అవకాశం వస్తే సవరించు కుందామనుకుంటున్నారు.’ అని పాట పాడుతూ ఉంటారు. ఏదైనా ఘటన జరగ్గానే ‘ప్రజలకు మీపై నమ్మకం పోయింది. మొత్తం కాబినెట్‌ రిజైన్‌ చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’ అంటారు. ఆ డిమాండ్‌ను అధికారపక్షం ఎలాగూ పట్టించుకోదు కాబట్టి గవర్నరు దగ్గరకు, ఆ పై రాష్ట్రపతి వద్దకు వెళ్లి ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువైపోయాయి. సామాన్యుడు జీవించే పరిస్థితి లేదు. తక్షణం రాష్ట్రప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.’ అని మహజర్లు యిస్తారు. ప్రభుత్వం ఏదైనా గట్టి నిర్ణయం తీసుకోగానే ‘ఇది ఏకపక్ష నిర్ణయం. ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఈ ఆంశంపై ప్రజాభిప్రాయం కోరుతూ మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి.’ అంటారు.

ఎటుతిరిగి ఏం చెప్పినా విషయం ఒకటే- మళ్లీ ఎన్నికలు రావాలి. గతంలో మేం చేసిన మంచి పనులు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యాం. అందువన జనాలు అపార్థం చేసుకున్నారు. మా ప్రత్యామ్నాయం మాకంటె అధ్వాన్నంగా ఉందని గ్రహించారు కాబట్టి, యీసారి మమ్మల్నే గెలిపిస్తారు! – అని. అయితే పాలకపక్షం వీళ్ల మాటల్ని అస్సలు పట్టించుకోదు. ‘విశ్వాసం కోల్పోయాం అంటున్నారు, అసలు మాపై మీకు విశ్వాసం ఎప్పుడుంది కనుక? మాకేమైనా మీరు ఓటేశారా? మాకు వేసినవాళ్లు వచ్చి దిగిపోమంటే అప్పుడు ఆలోచిస్తాం’ అని కొట్టిపడేస్తారు. అసెంబ్లీ ఎన్నికలు ఓ పట్టాన రావు కాబట్టి ప్రతిపక్షం ఉపయెన్నికల కోసం, స్థానిక ఎన్నికల కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. వాటిలో ఏ కొన్ని సీట్లు వచ్చినా ‘అధికార దుర్వినియోగం జరిగినా ప్రజలకు మీపై కలిగిన విరక్తి ఫలితాల్లో ప్రతిఫలిస్తోంది. దిగిపోండి.’ అనవచ్చని ఆశ!

ఇది ఎప్పుడూ ఉండే భాగోతం. అయితే టిడిపి యీ మధ్య వింతగా ప్రవర్తించింది. అధికారపక్షం స్థానిక ఎన్నికలు ప్రకటిస్తే ‘అప్పుడే వద్దు మొర్రో’ అనసాగింది. దానికి రకరకాల కారణాలు వెతికింది. బిసి రిజర్వేషన్ల సంగతి ఎత్తింది. అది కోర్టు తీర్పని, దానిలో అధికారపక్షం చేయగలిగేది ఏమీ లేదని తెలుసు. అయినా దాన్నే తప్పు పట్టింది. నిజానికి తమిళనాడులో బిసిలకు ఉద్యోగాల్లో, చదువుల్లో అత్యధికంగా రిజర్వేషన్లున్నా రాజకీయ రిజర్వేషన్లు లేవు. కర్ణాటకలో 50% సీలింగు దాటలేదు. 2014 ఎన్నికలలో ఆంధ్రలో సీలింగు దాటదామంటే, కోర్టు డేటా యివ్వండి అని అడిగింది. సమయం చాలటం లేదు, యీసారికి మినహాయింపు యివ్వండి అని కిరణ్‌ కుమార్‌ రెడ్డి బతిమాలి కోర్టును ఒప్పించారు. వాటి ఫలితాలు వచ్చేసరికి ఆయన దిగిపోయాడు.

ఆ తర్వాత ఐదేళ్లపాటు టిడిపియే రాజ్యం చేసింది. 2020లో వచ్చే స్థానిక ఎన్నికలలో డేటా యివ్వాల్సి వుంటుంది, డేటా సేకరించండి అని ఆ ఐదేళ్లల్లో అధికారులను ఒక్కసారీ ఆదేశించలేదు. ఇప్పుడు మీరు సరైన లాయర్ని పెట్టుకోకుండా కేసు పోగొట్టేశారు అని వైసిపిని నిందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ కోటాలపై రాసిన వ్యాసంలో కోర్టులు డేటా గురించి పట్టుబడుతున్న విషయం గురించి రాశాను. ఆ డేటా లేకుండా కోర్టులు కన్విన్స్‌ కావటం లేదు, ఎడ్వకేటు ఎంత ఘనుడైనా సరే! సుప్రీం కోర్టుకి అపీలుకి వెళ్లాల్సింది అంటారు వీళ్లు. వెళ్లినా అదే గతి. పైగా ఆ కారణం చేత ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం ఊరుకోదు. నిధులు ఆపేస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా టిడిపి ఎన్నికలు వాయిదా వేయమని, యిప్పట్లో నిర్వహించకూడదని అనడం ఆశ్చర్యం కలిగించింది.

ఈ సమస్యను జగన్‌ అతి సులభంగా పరిష్కరించేశాడు. ‘కోర్టు యివ్వకపోతే ఏం? మనమే యిద్దాం. మన అభ్యర్థుల్లో ఆ మేరకు బిసిలకు టిక్కెట్లు యిద్దాం.’ అన్నాడు. నిజమే కదా, బిసిలకు ఎక్కువమందికి పదవులు రావాలి. పార్టీలు యీ రకంగా యిచ్చేయవచ్చు. టిడిపి మారుమాట్లాడ లేకపోయింది. అలా కుదరదంటే బిసిలకు కోపం వస్తుంది కాబట్టి. ఇక అమరావతిని వాడుకోబోయారు. ‘అమరావతి రైతుల సమస్య పరిష్కరించందే ఎన్నికలేమిటి? చావుబతుకుల మధ్య కొట్టుకులాడుతున్న వాళ్లు ఎన్నికలలో పాల్గొనగలరా? అసలు అక్కడ ఎన్నికలు నిర్వహించే వాతావరణం ఉందా?’ అన్నారు. అయితే అక్కడ జరపవద్దు లెండి అని తేల్చేశాడు జగన్‌.

కరోనా వైరస్‌తో ప్రపంచమే వణుకుతోంది. ఇప్పుడీ ఎన్నికలు అవసరమా? అని యింకో ప్రశ్న లేవనెత్తింది టిడిపి. కరోనా ఉంది నిజమే, నిత్యవ్యవహారాలు ఏమైనా ఆగాయా? కొట్లాటకు కామా పడిందా? టిడిపి అభ్యర్థులు అమ్మో కరోనా, మేం బయటకు రాం అన్నారా? ‘మేం నామినేషన్లు వేద్దామంటే వైసిపి వాళ్లు లాక్కుని చింపేస్తున్నారు, మమ్మల్ని చావగొడుతున్నారు, బెదిరిస్తున్నారు’ అంటూ వాపోతున్నారు తప్ప ‘అమ్మయ్య, వెధవ పీడ వదిలింది. హాయిగా మూతికి గుడ్డ కట్టుకుని యింట్లో వాలుకుర్చీలో కూర్చుని టీవీలో కరోనా న్యూస్‌ చూస్తూ ఉండవచ్చు’ అనుకుంటున్నారా?

హోం వర్కు చేయని కుర్రాడు బడి ఎగ్గొట్టడానికి ఎన్ని కారణాలు చెపుతాడో బాబు అన్ని కారణాలూ ట్రై చేస్తారని భయం వేసింది. ఇలాటి చేష్టలు జనాల్లో ఎటువంటి సందేశాలు పంపుతాయో రాజకీయాల్లో పండిపోయిన చంద్రబాబు ఎందుకు ఊహించలేదో తెలియలేదు. ‘ఒక్క ఛాన్స్‌ యివ్వమని బతిమాలితే పోనీ కదాని యిచ్చారు. కానీ నీ తుగ్లక్‌ పరిపాలనతో విసిగిపోయారు. బుద్ధి చెప్పే తరుణం గురించి చూస్తున్నారు.’ అని గద్దె నెక్కిన మరుక్షణం నుంచి అంటూ వచ్చారు కదా, యిప్పుడా తరుణం వస్తే యీయన పారిపోదామని చూస్తున్నాడంటే ఆత్మవిశ్వాసం లేదన్నమాట అని జనాలు అనుకోరూ?

దానికి తగ్గట్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలుగుదేశం ఎన్నికల్లో పోటీ చేయకపోవడం మంచిది అని సలహా యిస్తూ పేద్ద వ్యాసం ఒకటి రాసి వదిలారు. గతంలో ఈనాడు అంటే టిడిపి పలుకుగా ఉండేది. అది బిజెపి పాలయ్యాక, టిడిపికి మద్దతిస్తున్నా, అసలైన టిడిపి పలుకంటే యిప్పుడు ఆంధ్రజ్యోతే! దానిలో రాసినదే టిడిపి నాయకులు కోట్‌ చేస్తారు. వీళ్లు చెప్పినదే చేసినదే వాళ్లు రాస్తారు. అదే సమాచారం, అవే వాదనలు, అవే డిమాండ్లు. ఈ పరిస్థితుల్లో రాధాకృష్ణ రాశారంటే, అది చంద్రబాబు మనసులో భావనే అని టిడిపి క్యాడర్‌, అభిమానులు అనుకుని తీరతారు.

ఎన్నికలు బహిష్కరించాలన్న ఆలోచన బలంగా కలిగి, దాన్ని అమలు చేస్తే క్యాడర్‌ రియాక్షన్‌ ఎలా వుంటుంది అని తెలుసుకోవడానికి బాబే రాధాకృష్ణ చేత రాయించేరేమో అనిపించింది. ‘పోరాడితే వచ్చేదేముంది?’ అనే డిఫీటిస్టు ఆలోచనాధోరణితో కాప్షన్‌ పెట్టారు. ‘పోరాడితే ఏముంది, సంకెళ్లు తప్ప’ అని కమ్యూనిస్టుల నినాదం. ఇప్పుడు అత్యంత దీనస్థితిలో ఉన్నాం, యింతకంటె పోయేదేముంది, అందుకే తెగిద్దాం అని నాయకులు చెప్తూ వుంటారు. నిజానికి టిడిపి పరిస్థితి అలాగే వుంది. దాని చరిత్రలో ఎన్నడూ ఎదురుకానంత పరాభవం కలిగింది. నెగ్గిన 23 మందిలో కూడా ముగ్గురు జారుకున్నారు. ఉన్న నాయకులు కూడా స్తబ్ధంగా ఉంటున్నారు. జగన్‌ గ్రహణం వదిలేకనే గడప దిగుదా మనుకుంటున్నారు.

ఇలాటి పరిస్థితుల్లో ‘చెడ్డకాపురానికి ముప్పేమిటి..?’ అన్నట్లు పోరాడితే అంతోయింతో పైకి వెళ్లడమే తప్ప యింతకంటె కిందకు దిగలేరు కదా! చక్కటి నటుడు మిక్కిలినేనిని కించపరిచారని మనసు చివుక్కుమన్నా ప్రాస కోసం ఆయన పేరు వాడుకున్నారని సరిపెట్టుకునే ఛలోక్తి యిక్కడ గుర్తుకు వస్తోంది. రావు గోపాలరావు ఒకసారి ‘అక్కినేనికి ఎక్కడానికి మెట్లు లేవు, మిక్కిలినేనికి దిగడానికి లేవు’ అని చమత్కరించారు. ఇప్పుడు టిడిపికి దిగడానికి మెట్లు లేవు. ఎక్కితే ఒకటో రెండో మెట్లు ఎక్కవచ్చు. శాతాల వారీగా చూసుకుంటే అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న సీట్ల కంటె స్థానిక ఎన్నికలలో ఎక్కువ శాతం సీట్లు రావచ్చు. పైగా గ్రామగ్రామాల్లో ఉన్న క్యాడర్‌ను ఉత్తేజితం చేసినట్లవుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో పై స్థాయిలో పోటీ జరుగుతుంది. అదే పంచాయితీ లనగానే ప్రతి కార్యకర్త యాక్టివేట్‌ అవుతాడు. ఆవేశకావేషాలు చూపిస్తారు.

స్థానిక ఎన్నికలలో పోటీ చేయడానికి దడిసి, నాయకుడు కాడి పారేశారని క్యాడర్‌ అనుకుంటే పార్టీకి పుట్టగతుంటాయా? అనే ఆలోచన రాధాకృష్ణగారికి కూడా వచ్చి వుంటుంది. అందువలన బహిష్కరణకు కేసు తయారుచేశారు. ఎన్నికల సమయంలో మద్యం, ధనం సరఫరాపై ప్రభుత్వం చేసిన చట్టాన్ని దానికి వాడుకున్నారు. ఎలాగోలా నెగ్గినా వైసిపి ప్రభుత్వం యీ చట్టం కింద కేసు పెట్టి వేధిస్తుందని, పోలీసు వత్తాసు పలుకుతారని అందువలన కేసుల్లో యిరుక్కోవడం కంటె అసలా జోలికి వెళ్లకపోవడమే మంచిదని వాదించారు. రాజకీయాలంటేనే పోరాటాలు, కేసులు, పోలీసు స్టేషన్లు, కోర్టు, బెయిళ్లు, జైళ్లు..! అవి వంటికి పడవనుకుంటే కిరాణా కొట్టు పెట్టుకుంటే మంచిది. ఐనా అన్యాయంగా కేసు పెడితే, కోర్టుకు వెళ్లలేరా?

మొన్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో టిడిపి అభ్యర్థుందరూ విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేసి, జేబులు ఖాళీ చేసేసుకుని కూర్చున్నారనీ, అప్పులపాయ్యారని, యిప్పుడీ ఎన్నికకు ఖర్చు పెట్టడానికి డబ్బు లేదని, గోదాలోకి దిగి దివాళా తీయడం దేనికని రాధాకృష్ణ జాలి పడుతున్నారు. అసలు ఎన్నికల్లో అంతలేసి ఖర్చు ఎందుకు పెట్టారు? గెలిస్తే మళ్లీ సంపాదిద్దామనా అనే ప్రశ్న రాదా? ఇది టిడిపిని పూర్‌ లైట్‌లో చూపించినట్లు కాదా? అయినా యీసారి ఓటర్లకు మద్యం, ధనం యివ్వకుండా దాటేయవచ్చు, ఓటర్లు అడిగితే ‘ఏం చేయమంటారు? చట్టం అలా ఏడిసింది, నెగ్గాక, వీళ్లు చూపు మరల్చాక, చాటుగా పంపిస్తాలే’ అని చెప్పుకోవచ్చు.  ఆ చట్టం గురించి అంత భయం దేనికి? ఇప్పుడున్న చట్టాలు మాత్రం సారా సరఫరా చేసుకోవచ్చని చెపుతున్నాయా?

‘అబ్బే, ఎన్నికల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి, పదవి ఊడగొట్టే సౌలభ్యం ఉంది దీనిలో’ అంటున్నారు రాధాకృష్ణ. ప్రభుత్వం తలచుకుంటే బహిరంగ మూత్రవిసర్జన కేసైనా పెట్టవచ్చు. అది నిలవాలి కదా! పదవి ఊడగొట్టడం అంత సులభమా? ఎమ్మెల్సీ పదవి ఊడగొట్టడానికి జగన్‌ పడుతున్న పాట్లు, చేసుకుంటున్న రాజీలు చూస్తున్నాం కదా. అయినా తప్పు చేయనప్పుడు భయం దేనికి? చేసినా ప్రత్యర్థి చేసిన అక్రమాలను సెల్‌ఫోన్‌లో షూట్‌ చేసుకుని పెట్టుకుంటే బేరాలాడుకోవచ్చు కదా. ఎన్నికలు బహిష్కరించడం పలాయనవాదం కాదనీ, గతంలో కాంగ్రెసు కూడా చేసిందని రాధాకృష్ణ నచ్చచెప్పారు. ఇన్నాళ్లకు కాంగ్రెసు యిలా పనికి వచ్చిందన్నమాట. కాంగ్రెసు నిలువెల్లా పుచ్చిపోయిందని, కుక్కమూతి పిందె అని దాన్ని పారద్రోలేదాకా రాష్ట్రానికి ముక్తి లేదని గర్జించిన ఎన్టీయార్‌ నెలకొల్పిన పార్టీ యిప్పుడు కాంగ్రెసును ఆదర్శంగా తీసుకోవాలని రాధా‘కృష్ణ’ బాబుకి గీతోపదేశం చేశారు.

పార్టీలో ఎవరికీ తనంత బుర్ర లేదని బాబుకి గట్టి నమ్మకం. ఎవరేం చెప్పినా ‘నా కన్నీ తెలుసు’ అంటారు. తను అనుకున్నదే చేస్తారు. ‘పార్టీలో ఎవరేం చెప్పినా, నా మాటే ఫైనల్‌’ అని శివగామి స్టయిల్లో పదేపదే ప్రకటిస్తూ ఉంటారు. ఎన్నికలకు డుమ్మా కొట్టడానికి నిశ్చయించుకుని ఆ మాటను రాధాకృష్ణ ముఖత: చెప్పించి ఉంటారని భయపడ్డాను. అది బయటకు వచ్చాక, కార్యకర్తల్లో చర్చలు జరిగి వుంటాయి. అభిమానులు  కూడా ఎదురు తిరిగి వుంటారు- ‘మీరిలా మమ్మల్ని గాలికి వదిలేస్తే యిక వైసిపి వాళ్లు మమ్మల్ని నవిలేస్తారు. మేం వాళ్ల చెప్పు కింద తేలులా పడి వుండాల్సి వస్తుంది. పోటీ చేసి మనకూ కాస్త బలం ఉందని చూపించుకోకపోతే  వచ్చే ఎన్నికలకు మీకు మేం కూడా మిగలం.’ అని హెచ్చరించి వుంటారు. ఇప్పుడు చూడండి, పలనాడులో ఎంత దౌర్జన్యం జరిగిందో! టిడిపి అస్త్రసన్యాసం చేసి వుంటే యిలాటివి పది రెట్లు జరిగేవి.

ఏం జరిగిందో తెలియదు కానీ ఫైనల్‌గా టిడిపి ఎన్నికలలో పోటీ చేయడానికి నిశ్చయించుకుంది. ఆ విధంగా తన తప్పును దిద్దుకుంది. నేను దీన్ని హర్షిస్తాను. ఇప్పటికే వైసిపికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. గతంలో బాబు చేసిన తప్పులన్నీ జగన్‌ యిప్పుడు చేస్తున్నారు. ప్రతిపక్షాన్ని లెక్క చేయకపోవడం, 39% ఓట్లు తెచ్చుకున్న నాయకుడిని మనిషిగా చూడకపోవడం, సమాజంలో మేధావివర్గాలను సైతం సంప్రదించక పోవడం, గత ప్రభుత్వానికి ఆప్తులుగా తోచినవారిపై కక్ష సాధించడం, ఆర్థికపరమైన నష్టాలు కలిగించడం, ఆనాటి బిల్లులు చెల్లించక వారిని యిబ్బంది పెట్టడం, తోచినది అర్జంటుగా చేసేయడం, కోర్టు మొట్టికాయలు వేస్తున్నా బుద్ధి తెచ్చుకోకపోవడం, విమర్శిస్తున్న టీవీ ఛానెళ్లను నిలిపివేయడం – యిలా ఎన్నో అప్రజాస్వామికమైన చర్యలు చేస్తున్నారు.

వీటిని ప్రతిఘటించవలసిన అవసరం ఉంది. లేకపోతే ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకం అవుతుంది. గతంలో వైసిపి అసెంబ్లీని బహిష్కరించినపుడు ప్రజావాణిని వినిపించే వేదికను వర్జిస్తున్నారని, తమను ఎన్నుకున్న ఓటర్ల పట్ల బాధ్యతనుంచి పారిపోతున్నారని టిడిపి విమర్శించడంలో న్యాయం ఉంది. టిడిపి యిప్పుడా న్యాయాన్ని విస్మరించబోయి, సరిదిద్దుకుంది. జగన్‌ పోకడలు నచ్చనివారు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చేందుకు ఒక అవకాశాన్ని సమకూరుస్తోంది. బిజెపి, జనసేన, కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలెన్ని ఉన్నా వాటికి పెద్దగా వచ్చే ఓట్లు, సీట్లు వుండవు. వైసిపిని ఎదుర్కోగలిగినది టిడిపి మాత్రమే. ఆర్థిక, మానవ వనరుల్లో ఢీ అంటే ఢీ అనగలిగేది టిడిపి మాత్రమే. వైసిపి వయసుకు దాదాపు ఐదు రెట్లు వయసు టిడిపిది.

ప్రజాస్వామ్య సంక్షేమం కోరి టిడిపి నిర్ణయానికి జేజేలు పలుకుతున్నాం కానీ ‘పీత కష్టాలు పీతవి’ అన్నట్లు టిడిపి కష్టాలు టిడిపివి. ఎన్నికలకు సిద్ధం కావడంతో గుప్పిలి విప్పినట్లయింది. వేళ్లసందుల నుంచి నాయకులు జారిపోతున్నారు. అమరావతి నెత్తి కెత్తుకున్నప్పటి నుంచి యీ ప్రమాదాన్ని బాబు శంకిస్తూనే ఉన్నారు. టిడిపి తరహా ఫిరాయింపులను ప్రోత్సహించనని, పదవికి రాజీనామా చేసే రావాలని జగన్‌ అనడంతో బాబు ఊరడిల్లారు. అయినా తక్కిన ప్రాంతాల ప్రజలు ఏమనుకున్నా డోంట్‌కేర్‌, అమరావతిలోనే అన్నీ పెట్టాలన్న డిమాండ్‌ వదలను అనడంతో అక్కడి నాయకులు స్థానిక ప్రజల కోపానికి దడిసి, పార్టీ చెప్పిన విధంగా ఓటేయరన్న భయం పీడించింది. అందుకనే అసెంబ్లీలో కానీ, మండలిలో కానీ ఓటింగు జరగకుండా చూశారు.

స్థానిక ఎన్నికల ధర్మమాని ఆ ఘడియ వచ్చేసింది. అనేక జిల్లాలలో నాయకులు టిడిపికి గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఉండిపోయిన వాళ్లు పోటీ చేయం పొమ్మంటున్నారు. టిక్కెట్లు ఎవరికి యివ్వాలో తెలియక, యువతరానికి యిస్తాం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. యువతరంపై యీ ప్రేమ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ ఏమైందో తెలియలేదు. గతిలేక యిస్తున్నారని అనుకున్నా సరే వేలాది మంది టిడిపి తరఫున గోదాలోకి దిగుతున్నారు. వారిని చూపించి ‘నామినేషన్లు వేయనీయకుండా మేం హింసకు పాల్పడుతున్నాం అంటున్నారు. మరి వీరంతా ఎలా వేశారు?’ అని బొత్స అడుగుతున్నారు. 10 నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సరాసరిన 39% ఓట్లు తెచ్చుకున్న టిడిపికి కొన్ని పంచాయితీల్లో తప్పకుండా మెజారిటీ ఉంటుంది. జాగ్రత్తగా వర్కవుట్‌ చేసుకుంటే అక్కడ గెలిచే అవకాశాలున్నాయి.

ఎన్నికలనగానే ఎంత లేదన్నా ఖర్చులుంటాయి. పంచాయితీ ఎన్నికలంటే పార్టీ అధిష్టానం గ్రామగ్రామాలకూ డబ్బు పంపిణీ చేయవలసి వస్తుంది. వైసిపి విన్నింగ్‌ స్ట్రీక్‌లో ఉంది కాబట్టి అభ్యర్థులు సొంత డబ్బు ఖర్చు పెట్టవచ్చు కానీ ఆశాదీపం మిణుకుమిణుకు మంటున్న టిడిపి అభ్యర్థులు పార్టీయే యివ్వాలని ఎదురుచూస్తారు. కానీ పంపడం ఎలా అనేది సమస్య. ప్రభుత్వంలో ఉంటే అఫీషియల్‌ ఛానెల్స్‌ను వాడేయవచ్చు. ఇప్పుడు కుదరదు. గతంలో యిలాటి వ్యవహారాలు చూసుకునేవాళ్లు యిప్పుడు బిజెపిలో వెళ్లి కూర్చున్నారు. బాబుకి సొంత డబ్బు పంపే అలవాటు లేదు. ఇప్పుడు చేసుకుందా మనుకున్నా అవతల ఐటీ వాళ్లు గుడ్లగూబ కళ్లేసుకుని చూస్తున్నారు. ఈయన ఛానెళ్లన్నీ యీ పాటికే వాళ్లకు తెలిసిపోయి వుంటాయి. కొత్తవి కనిపెట్టడానికి టైము పడుతుంది.

బాబు సిపిఐతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారా అని ఆలోచిస్తే యిదో కారణమేమో అని తోస్తుంది. లేకపోతే వేరేదేముంది? వాళ్లతో పొత్తు ఎంత దండగమారిదో ఆత్మీయుడు పవన్‌ నడిగినా చెప్తాడు. సిపిఐ రామకృష్ణ దాదాపు టిడిపి వాడిలాగానే ప్రవర్తిస్తున్నా అది అమరావతి అనుబంధం అనుకోవచ్చు. తక్కిన సిపిఐ క్యాడరంతటికీ టిడిపిపై ప్రేమ పొర్లిపోతోందని అనుకోవడానికి లేదు. మరి ఎందుకీ పొత్తు? ‘బాబుకు ఎవరో ఒక విపింగ్‌ బాయ్‌ కావాలి. ఈసారి ఓడిపోగానే సిపిఐతో పొత్తు వల్లనే ఓడిపోయాం. లేకపోతేనా.. అనడానికి పెట్టుకున్నారు.’ అని ఓ కాంగ్రెసాయన చమత్కరించాడు. కమ్యూనిస్టు ఓట్లు మనకు ట్రాన్స్‌ఫర్‌ కావని జనసేనాధిపతి అనుభవంతో సెలవిచ్చాడు. ఐనా బాబు సిపిఐను ఎంచుకున్నారంటే నిధుల బదిలీకి ఛానెల్‌గా ఉంటారని కాబోలు!

ఎన్నికలలో వైసిపి అధిక స్థానాలను గెలుస్తుందని అందరికీ తెలుసు. కానీ టిడిపి నాయకుల నైరాశ్యం ఆశ్చర్యపరుస్తోంది. టిడిపి పని అయిపోయిందని ప్రజలు అనుకోవడం లేదు కానీ, వాళ్లు అనుకుని, అటు దూకేస్తున్నారు. బాబు యిన్నింగ్స్‌ పూర్తయిపోయాయని, సంక్షేమ పథకాల జగన్‌ ప్రాభవం తగ్గడానికి పదేళ్లు పడుతుందని, 2029 నాటికి 80 ఏళ్ల వయసులో బాబు ఓటర్లను ఆకర్షించ లేరని వాళ్లు అనుకుంటూండవచ్చు. అందువలన బాబు అర్జంటుగా తన స్థానంలో మరో యువనేతను చూపించాలి. ఎంత కాదన్నా యువతే ఫలితాలను నిర్దేశిస్తోంది.

1983లో ఎన్టీయార్‌ను గెలిపించినది, 2014లో మోదీని గెలిపించినది, 2019లో జగన్‌ను గెలిపించినది యువతే! 2014లో బాబును గెలిపించడానికి కారణం – కొత్త రాష్ట్రానికి పాలనాదక్షుడు కావాలనే లెక్క! అప్పుడు కూడా జగన్‌కు ఐదున్నర లక్షల ఓట్లు మాత్రమే తక్కువ వచ్చాయి. జగన్‌ కంటె వయసులో చిన్నవాడు, అప్పుడప్పుడు పాదయాత్రలు చేసి జనంలో యిమేజి పెంచుకోవలసినవాడు, టిడిపి భావి భాగ్యవిధాత ఐన లోకేశ్‌ యింట్లోనే కూర్చుని ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ కంటె మెంటల్‌ ఎక్సర్‌సైజ్‌ మీదే ధ్యాస పెట్టి ట్విట్టర్‌లోనే యాక్టివ్‌గా ఉంటున్నారు. టివి చర్చకు వచ్చైనా తన మేధస్సుతో ప్రేక్షకులను యింప్రెస్‌ చేసే ప్రయత్నం చేయడం లేదు.

అది టిడిపి పాలిట దురదృష్టం. బాబు లోకేశ్‌ను పక్కకు పెట్టి, మరో యువనాయకుణ్ని తయారు చేయవలసిన అవసరం ఎంతైనా కనబడుతోంది. ద్రుపదుడికి బుద్ధి చెప్పడానికి ద్రోణుడు అర్జునుడికి తర్ఫీదు యిచ్చి రంగంలోకి దింపాడు. జగన్‌కు ప్రత్యామ్నాయంగా చూపడానికి బాబు మరొకణ్ని తయారు చేయాలి. ఆ యువకుడికి బాబు తాలూకు బ్యాగేజి వుండదు. ఫ్రెష్‌గా కనబడతాడు. ఇవాళ కాకపోతే రేపైనా జగన్‌ను ఢీ కొంటాడు. టిడిపి అంగబం, అర్థబం అతనికి పనికి వస్తాయి. ఇది భవిష్యత్తులో జరగవలసిన కార్యక్రమం. ఎన్నికల వలన టిడిపికి ఒనగూడే తక్షణలాభమేమిటంటే తన సిద్ధాంతాలపై పునర్విమర్శ.

జగన్‌ సీటులో కూర్చోడానికి ముందు నుంచే ప్రతీదానికీ టిడిపి విమర్శలు గుప్సిస్తూ వచ్చింది. వాటిల్లో కొన్ని యిస్యూస్‌, కొన్ని నాన్‌-యిస్యూస్‌. వేటికి ప్రజలు ఎలా స్పందించారో యీ ఎన్నికలు సూచిస్తాయి. ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించి ఏమైనా బావుకున్నారో లేదో తేలిపోతుంది. ఇక దేన్ని ఎంతవరకు లాగాలి అనేది కూడా అర్థమౌతుంది. అమరావతినే పట్టుకుని వేళ్లాడడానికి కారణం ఆర్థిక వ్యవహారాలనే రాంగ్‌ సిగ్నల్‌ వెళుతోందేమో టిడిపికి తెలిసి వస్తుంది. ఈ యిన్‌పుట్స్‌తో తన స్ట్రాటజీని మార్చుకుంటూ వెళితే బాబు మాటల్లో ‘..అలా ముందుకు వెళతారు.’ సమీక్ష చేసుకోకపోతే చతికిల పడతారు. కార్యకర్తలు కూడా నాయకుల బాట పట్టి గోడ దూకేస్తూంటే గుడ్లప్పగించి చూస్తూ కూర్చోవాలి.

ఎమ్బీయస్‌ ప్రసాద్‌