ప్రియాంక చతుర్వేది.. అంతకు ముందు ఈమె పేరు సౌత్ లో పెద్దగా తెలియదు. అయితే కాంగ్రెస్ కు రాజీనామా చేసినప్పుడు సౌత్ లో కూడా ఈమె పేరు బాగా వినిపించింది. ఈమె కాంగ్రెస్ అధిష్టానం తీరును తప్పు పడుతూ.. బయటకు వచ్చారు. అప్పటి వరకూ కాంగ్రెస్ లో ఏవో హోదాల్లో పని చేశారు. పత్రికల్లో వ్యాసాలు రాస్తూ కాంగ్రెస్ పార్టీ అజెండాను చాటారు.
అయితే కాంగ్రెస్ కు రాజీనామా చేసి, శివసేన తీర్థం పుచ్చుకున్నారు ప్రియాంక. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు ముందే.. ఈమె శివసేనలో చేరిపోయారు. ఇంతలోనే ఈమెకు ఏకంగా రాజ్యసభ సీటు దక్కడం గమనార్హం. మహారాష్ట్ర అసెంబ్లీ కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవుతున్న వారిలో ప్రియాంక చతుర్వేది కూడా ఉన్నారు.
ఈమె వయసు ఇంకా 40 సంవత్సరాలే. ఇంతలోనే పెద్దల సభకు ఈమెకు అవకాశం దక్కడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే.. ఈమెకు ఆ పార్టీ స్పోక్ పర్సన్ గా అవకాశం ఉండేదేమో కానీ, ఇలా ఎంపీ హోదా ఇంత త్వరగా దక్కే అవకాశాలు ఉండేవి కావేమో. అలా శివసేనలోకి చేరడం, ఇంతలోనే ఇలా రాజ్యసభకు నామినేట్ కావడం… ప్రియాంకకు ఇలా కలిసి వచ్చినట్టుగా ఉంది.