కరోనా భయంతో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 6 వారాల పాటు వాయిదా పడ్డాయి. అప్పటికి కరోనా భయం పూర్తిగా తగ్గితేనే ఎన్నికలు జరగుతాయి, లేకపోతే ఆరు వారాల గడువు మరింత పెరిగే అవకాశముంది. ఎన్నికల వాయిదా గురించి ప్రకటించిన ఎన్నికల కమిషనర్ చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన అలజడులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఆ రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయబోతున్నారు.
మొత్తానికి కరోనా కారణంగా టీడీపీ, బీజేపీ, జనసేన కోరిక సగం నెరవేరినట్టయింది. ఆయా పార్టీలు ఏకంగా ఎన్నికల రద్దు కోరితే కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికలు వాయిదా పడటంతో ప్రతిపక్షాలన్నీ చంకలు గుద్దుకుంటున్నాయి. ఈసీ ప్రకటనను స్వాగతిస్తున్నామంటూ ఇప్పటికే స్టేట్ మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు నేతలు. అయితే ఇప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది.
ఏకగ్రవాలతో వైసీపీ నిమ్మళంగా ఉంది. దాదాపుగా జిల్లా పరిషత్ లన్నీ ఏకగ్రీవాలతో వైసీపీకే దక్కుతాయని స్పష్టమవుతోంది. మిగిలిన చోట్ల కూడా అభ్యర్థులను బుజ్జగించుకోడానికి ఇప్పుడు వారికి బాగా టైమ్ దొరికింది. మరోవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా పోయింది. అధికార, ప్రతిపక్షాలకు సంయమనం పాటించడం ఇప్పుడు అత్యవసరం.
ఏకగ్రీవాలు మినహాయిస్తే ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అభ్యర్థులకు మాత్రం ఈ 6 వారాలు కత్తిమీద సామే. పార్టీల విషయం పక్కనపెడితే.. ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి అభ్యర్థులంతా ఆరు వారాల పాటు వినయ విధేయతలు ప్రదర్శించాలి. ఇక సర్పంచ్ ల సమరం ఒక్కటే నోటిఫికేషన్ కూడా విడుదల కాకుండా వాయిదా పడింది. కోర్టు కేసుల్లో ఉన్న మిగతా కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల విషయం కూడా తేలితే.. వాటికి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది కాబట్టి, పేదవారి ఇళ్ల పట్టాల విషయం కూడా అప్పటి వరకు అటకెక్కినట్టే. టీడీపీ రాద్ధాంతం చేసి మరీ ఉగాదికి పేదల మొహంలో సంతోషాన్ని దూరం చేసింది. ఇప్పుడిది అనివార్యంగా మరింత ఆలస్యమవుతోంది. మొత్తమ్మీద ఏకగ్రీవాలతో వైసీపీ రిలాక్స్ గా ఉంటే.. ముందే కాడె పడేసిన టీడీపీ, ప్రభుత్వంపై నిందలు మోపడానికి కారణాలు వెతుక్కుంటోంది.