కొంతమంది రాజకీయ పార్టీల అధినేతలు వాస్తవంలో బతకరు. ఆశల పల్లకీలో విహరిస్తుంటారు. ఏపీ, తెలంగాణలో ఇలా ఆశల పల్లకీలో విహరిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల. వచ్చే ఎన్నికల్లో తాము ముఖ్యమంత్రులం అయిపోతామని వీరిద్దరికీ ప్రగాఢమైన నమ్మకం ఉంది. దాన్నేమీ వారు దాచుకోవడంలేదు. బహిరంగంగానే చెబుతున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, తెలంగాణలో షర్మిల వచ్చే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రినని, తెలంగాణాకు తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టిస్తానని ఖమ్మం జిల్లాలో బహిరంగంగానే చెప్పింది. ముఖ్యమంత్రులం అయిపోతామని వీరిద్దరూ ఎలా కలలు కంటున్నారో అర్ధం కావడంలేదు.
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు అంటారా? జరగొచ్చు. నిజమే. కానీ అలా జరగడానికి ఏదో బేస్ లేదా లాజిక్ ఉండాలి కదా. దానికి అనుకూలమైన పరిస్థితి ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆశపడటానికి ఒక బేస్ ఉంది. ఆయన జనసేన పార్టీ పెట్టుకొని 2014 నుంచి రాజకీయాలలో కిందా మీదా పడుతున్నాడు. ఆయన సినిమా హీరో కాబట్టి ఆయనకంటూ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాయి. కానీ 2019 ఎన్నికల్లో ఇవి ఆయనకు ఉపయోగపడలేదు. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ అపజయం ఎదురైంది. ఆయనకు మొదటి నుంచి పార్టీ టైం రాజకీయ నాయకుడనే పేరుంది. విచిత్రమేమిటంటే ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న పవర్ స్టార్ ఈనాటికీ అలాగే ఉన్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అర్ధం కాదు.
తన అభిప్రాయాలను చాలా త్వరగా మార్చుకుంటుంటాడు. పవన్ కల్యాణ్ చుట్టే కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. పార్టీ ఆవిర్భావ సభలో పొత్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలే కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే జనసేన లక్ష్యమన్న పవన్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని అన్నాడు. వైసీపీని ఓడించేందుకు పొత్తులకు సిద్ధమనే సంకేతం ఇచ్చాడు. పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ టీడీపీ నేతలు మాట్లాడటం.. త్యాగాలకు సిద్ధమంటూ చంద్రబాబు కామెంట్ చేయడంతో.. ఏపీలో పొత్తులు ఖాయమనే ప్రచారం సాగింది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ- జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. పవన్ కామెంట్లతో 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడుతాయా లేక టీడీపీ, జనసేన కలుస్తాయా అన్నదానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. టీడీపీతో పొత్తుపై బీజేపీ ఆసక్తి లేదనే ప్రచారం సాగుతోంది.
అయితే జనసేన నేతలు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తేనే ఏ పార్టీతోనైనా పొత్తు ఉంటుందని చెప్పారు. లేదంటే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని నాగబాబు కూడా అన్నారు. పవన్ సీఎం అంశంపై టీడీపీ సైలెంట్ గా ఉండగా.. అలాంటి ప్రకటన తాము చేయబోమని బీజేపీ ప్రకటించింది. దీంతో ఏపీలో పొత్తుల అంశం గందరగోళంగా మారింది. తాజాగా ప్రకాశం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్… మరోసారి పొత్తులపై కీలక ప్రకటన చేశారు. అయితే ఈసారి గతంలో చేసిన ప్రకటనకు భిన్నమైన ప్రకటన చేశారు. దీంతో పవన్ కల్యాణ్ పొత్తుల విషయంలో యూ టర్న్ తీసుకున్నారనే అభిప్రాయం వస్తోంది. జనసేనతో పొత్తు ఉండాలని కోరుకుంటున్న టీడీపీలో కలవరం రేపుతోంది. ప్రస్తుతం తనకు ఎవరితోనూ పొత్తులు లేవని, ప్రజలతోనే పొత్తులు ఉంటాయని పవన్ అన్నారు. ఇది అర్ధం లేని మాట. సినిమా డైలాగులా ఉంది.
ప్రజలతో పొత్తు ఉండటమేమిటి? అంటే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పడమే కదా. గతంలో వైసీపీని ఓడించేందుకు విపక్షాలు ఏకం కావాలనే సంకేతం ఇచ్చిన పవన్.. ఇప్పుడు మాత్రం ప్రజలతోనే పొత్తు ఉంటుందని చెప్పడం చర్చగా మారింది. అంతేకాదు జనసేనకు అధికారం ఇవ్వాలని జనాలు కోరుకుంటున్నారంటూ.. పరోక్షంగా తానే సీఎం అభ్యర్థి అని తేల్చేశారు. జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నట్లు పవన్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తేనే పొత్తులు ఉంటాయనే అర్ధం వచ్చేలా తాజాగా పవన్ చేసిన కామెంట్లు ఉన్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పవన్ ను ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించి ఏ పార్టీ పొత్తు పెట్టుకోదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని టీడీపీ, బీజేపీ బల్ల గుద్ది చెబుతున్నాయి. అలాంటప్పుడు ఆ రెండు పార్టీలు పవన్ ను సీఎం చేస్తామని ఎందుకు ప్రకటిస్తాయి?
ఇక తెలంగాణలో షర్మిల విషయానికొస్తే … ఏపీలో పవన్ కు ఉన్నంత బేస్ కూడా షర్మిలకు లేదు. రాజకీయంగా ఆమెకు ఎలాంటి ఇమేజ్ లేదు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని రాజకీయం చేస్తోంది. తాను తెలంగాణా కోడలిని కాబట్టి తనకు ఇక్కడ రాజకీయాలు చేసే హక్కు ఉందంటుంది. షర్మిల తెలంగాణా రాజకీయాల్లోకి రాగానే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కొంతమేరకు భయంతో హడావుడి చేసినా ఆమెకు ఉన్న సీన్ ఏమిటో త్వరలోనే తెలిసిపోయింది. దాంతో ఆమెను పట్టించుకోవడం మానేశాయి. మిగతా పార్టీలు ఆమె విమర్శలకు స్పందించడంలేదు. ఆమె మానాన ఆమె దీక్షలు, పాదయాత్రలు చేసుకుంటోంది. ఆమె విమర్శలు చేసేది కేసీఆర్ మీద మాత్రమే. కాంగ్రెస్ ను, బీజేపీని ఏమీ కామెంట్ చేయదు.
తన తండ్రి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆ నమ్మకంతోనే షర్మిల కూడా పాదయాత్ర చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించింది. అంతటితో ఊరుకోకుండా కాబోయే ముఖ్యమంత్రి తానే అని చెప్పింది. తెలంగాణాకు తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టిస్తానన్నది. ఆమె ఏ ధైర్యంతో. ఏ నమ్మకంతో ఇలా చెప్పిందో అర్ధం కావడంలేదు. పార్టీలో ఆమె తప్ప ప్రజలకు ఎవరూ తెలియదు. పార్టీ నిర్మాణం లేదు. పెద్ద నాయకులు ఎవరూ లేరు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీకి అభ్యర్థులు దొరుకుతారా అనే విషయం షర్మిల ఆలోచించిందా? ఏపీలో పవన్ కళ్యాణ్, తెలంగాణలో షర్మిల నేల మీద నడిస్తే బాగుంటుంది.