అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ సిగ్గుమాలిన రాజకీయానికి తెగబడుతోంది. ప్రభుత్వాధికారులు తీసుకున్న చర్యలు కేవలం ఒక ఆక్రమణకు సంబంధించినవి.. అది ఆక్రమణేనా? కాదా? అనేది ప్రస్తుతానికి కోర్టు పరిధిలోకి వెళ్లింది.. అక్కడ తేలుతుంది. అయితే ఒక అక్రమాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వాధికారులు చేసిన చర్యను, కులాలకు ఆపాదించి, ఆ కులాల మీద జరిగిన దాడిగా రంగుపూసి రాజకీయం చేయడం తెలుగుదేశం పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
‘ప్రభుత్వభూమిని కాలువకు సంబంధించిన భూమిని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నందుకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చి మరీ కూల్చివేతకు ఉపక్రమించింది.’ ఈ వాక్యాన్ని గమనించినప్పుడు ఇది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ అని మనకు అర్థమవుతుంది. నోటీసులను ప్రభుత్వాధికారులు చెబుతున్నట్లుగా 2వ తేదీన కాకుండా, కూల్చివేతలు చేపట్టిన రోజునే ఇచ్చారా లేదా?
అనేది ఒక రకమైన మీమాంస. అలాగే, నోటీసులు ఇచ్చారు సరే, రాత్రి వేళ వచ్చి ఎందుకు కూల్చివేతలు ప్రారంభించారు? అనేది ఇంకో రకం మీమాంస! ఈ రెండు విషయాల గురించి ప్రభుత్వాన్ని ఎవరైనా ఒక మాట అనడానికి అవకాశం ఉంది. నోటీసుల విషయంలో ఎవరు చెబుతున్న మాట నిజమో నిదానంగా తేలుతుంది.
ఇచ్చిన వాళ్లు తయారైన ఆదేశాల మీద ఉన్న తేదీని ఆధారంగా చూపిస్తారు. నోటీసులు పుచ్చుకున్న వాళ్లు తమకు ఇవ్వనే లేదని బొంకుతారు.. ఈ పంచాయతీ తేలదు. ఇక రెండో విషయానికి వస్తే.. పగటివేళ కూలిస్తే.. నోటీసుల్ని గౌరవించి, తమ ఆక్రమణల్ని అంగీకరించి అందుకు సమ్మతించే రకమేనా ఆ వ్యక్తులు అనేది ప్రత్యుత్తరం. ప్రభుత్వాధికారులు ఏ పని చేయదలచుకున్నా, తమ అక్రమాలను అడ్డుకున్నా.. దానిని రాద్ధాంతం చేసి పాలక పార్టీ మీద, జగన్ మీద బురద చల్లడానికి అనువుగా వాడుకోవడం అనేది వారి దిగజారుడు రాజకీయం. కాబట్టి ఈ ప్రశ్నలకు, ఉచితానుచితాలకు అర్థం లేదు.
అయ్యన్నపాత్రుడి ఆక్రమణలను కూల్చివేయడానికి ప్రయత్నిస్తే.. ‘‘బీసీల గొంతుపై వైకాపా కత్తి’’ అంటూ ఆక్రోశించడం ఏమిటో ఎంతకూ అర్థం కాని సంగతి. చలో నర్సీపట్నం కార్యక్రమంలో తెలుగుదేశం నాయకుల విలాపాలను గమనిస్తే.. చిరాకు పుడుతుంది. ఆక్రమణలకు సంబంధించిన వ్యవహారాన్ని కులానికి పులమడానికి, బీసీల మీద దాడిగా అభివర్ణించడానికి ఎంతగా సిగ్గులేని తనం ఉండాలో అనిపిస్తుంది.
టీడీపీ నాయకులు ఇలాంటి శవరాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు పేరుమోశారు. అందులో సందేహం లేదు. ఒకవైపు బీసీకులాల మీద జరిగిన దాడి అంటూనే అల్లూరి స్ఫూర్తితో పోరాడాలని పిలుపునివ్వడం చిత్రంగా ఉంది. నిజానికి ప్రభుత్వం పోషిస్తున్నదే అల్లూరి సీతారామరాజు పాత్ర! బ్రిటిషు వారి ఆక్రమణలను ఆయన ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆయన పేరు వాడుకుంటూ టీడీపీ సిగ్గులేకుండా ఆక్రమణలను సమర్థించుకుంటోంది.
ఈ తొలగింపు ప్రయత్నాలను బీసీ కులాలపై దాడిగా అభివర్ణిస్తున్న తెలుగుదేశం నాయకులు.. అలాంటి కలర్ పూయడం ద్వారా.. చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న కరకట్ట ఆక్రమణల భవనాన్ని కూలదోయడం గురించి ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారా? అనిపిస్తోంది. అగ్రవర్ణాలకు చెందిన చంద్రబాబు కరకట్ట భవనం ఆక్రమణల్ని కూలిస్తే తప్ప.. ఆ పార్టీలోని బీసీలు చల్లారేలా లేరు మరి! అని ప్రజలు నవ్వుకుంటున్నారు.