ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రటకన చేశారు. మొత్తం ఆరు వారాల పాటు స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆరు వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియ యథావిధిగా సాగే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. కరోనా భయాల నేపథ్యంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడినట్టుగా తెలిపారు.
అయితే ఇప్పటి వరకూ దాఖలు అయిన నామినేషన్లు చెల్లుబాటు అవుతాయని ఆయన ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులకూ అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటి వరకూ కొనసాగిన ఎన్నికల ప్రక్రియకు అంతా విలువ ఉంటుందని, అయితే ఇక జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ మాత్రం వాయిదా పడిందని పేర్కొన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా వాయిదా పడినట్టే అని స్పష్టం అవుతూ ఉంది.
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాల్సిన సమయంలో ఈసీ వాయిదాను ప్రకటించింది. దీంతో ఆరు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఎక్కడిక్కడ ఆపేసినట్టే. స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు ఓటు వేయడానికి చాలా సమయం పడుతుందని..కరోనా భయాల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన రేపినట్టుగా అవుతుందని.. అందుకే ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసినట్టుగా స్టేట్ ఈసీ ప్రకటించింది.