రాజకీయాల్లో ఉన్నవారు…జీవితకాలం పదవులకు అంటిపెట్టుకుని ఉండాలనుకోవడాన్ని మనం చూస్తున్నాం. ఒక సారి మంత్రి పదవిలోకి వస్తే- తన పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళూ తానే మంత్రిగా ఉండాలనుకోవడం మన రాజకీయాల్లో ఒక రివాజుగా మారి పోయింది. దీనిని ఒక 'పొలిటికల్ మైండ్ సెట్' గా ప్రజలు కూడా పరిగణిస్తున్నప్పటికీ- ఇది ఒక 'పొలిటికల్ పాండిమోనియం' లాటిదే.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ…2024 ఎన్నికల కోసం చకోరపక్షుల్లా ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీ- 2024 లో అధికారం లోకి వస్తే- ఎవరెవరు మంత్రులు అవుతారో చెప్పడానికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు.
నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన రాజప్ప, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, నెల్లూరు నారాయణ, జవహర్, ఆనందరావు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, పత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత వగైరాలే మంత్రులు. 2029 లో గెలిచినా వీళ్ళే మంత్రులు…2033 లో గెలిచినా వీళ్లే మంత్రులు- దేముడు ఈలోపు ఎవరినైనా పిలిస్తే తప్ప.
వీరిని దాటి చంద్రబాబు నాయుడు ఆలోచించలేక పోతున్నారు. వీరికి ఆవల బోలెడంత ప్రపంచం…ప్రతిభ, యువత, ఉత్సాహం, సేవ చేయాలనే చిత్తశుద్ధి టీడీపీలో ఉన్నదనే విషయం ఆయనకు తట్టడం లేదు.
ఈ మైండ్ సెట్ వల్లే, 23 దగ్గర ఆగిపోయారు. ” చంద్రబాబు గెలిస్తే….అవే ఉపన్యాసాలు.అవే టెలి కాన్ఫరెన్స్ లు. అవే నీతులు. వాళ్లే మంత్రులు. అదే వర్క్ కల్చరూ…మిగిలిన నాయకులూ కనపడరు. కార్యకర్తలూ కనపడరు….” అని వ్యాఖ్యానించేవారు టీడీపీ లో కోకొల్లలు.
ఇటువంటి ' ఘనీభవించిన' రాజకీయ మనస్తత్వానికి స్వస్తి చెప్పే సువర్ణావకాశం …ముఖ్యమంత్రి జగన్ కు ఎదురుగా ఉంది. నభూతో..నభవిష్యత్ అన్నట్టుగా -175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలలో విజయం సాధించడం- జగన్ కు మాత్రమే సాధ్యమైంది. ” మంత్రి పదవి ఇవ్వకపోతే మా తడాఖా చూపిస్తాం” అంటూ ఆయనపై కళ్లెర్ర చేయగలిగినవారు ఈ 150 మందిలో ఒక్కరు ..అంటే …ఒక్కరు కూడా లేరు. అందరూ ఆయనపై ఆధారపడి గెలిచినవారే. ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచినవారే.
వై.ఎస్ హయాంలోనే చక్రం తిప్పుతూ… తోక బాగా ఆడించిన బొత్స సత్యనారాయణ లాటి ' వీర సీనియర్' కూడా- తోక మొత్తం లోపలికి సర్దేసి, వినయంగా- 'దక్కిందే మహా ప్రసాదం' అన్నట్టుగా …వీలైనంత వినయంగా ఉంటున్నారు. ఇక, మిగిలిన వారి గురించి చెప్పేదేముంది? 'అవకాశం ఉన్నంత మేర' రెండు చేతులా ప్రజాసేవ చేసుకుంటున్నారు, పెద్దగా సౌండ్ రాకుండా.
ఈ నేపథ్యం లో- జగన్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. రెండున్నరేళ్ల తర్వాత మొత్తం మంత్రుల స్థానం లో కొత్తవారికి అవకాశం ఇస్తానని జగన్- మొదటి రోజే ప్రకటించారు. ఆ గడువు మరో ఆరు నెలల్లో సమీపిస్తున్నది.
రెండున్నర ఏళ్ళు పూర్తి కాగానే, ప్రస్తుత 25 మంది మంత్రుల స్థానం లో 25 మందిని కొత్తగా తీసుకోవాలి. ఈ విషయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజకీయ నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి అందిపుచ్చుకోవాలి. 2014-2019 మధ్య కాలంలో తన మంత్రివర్గంలో పని చేసిన వారిలో ఒక్కరిని కూడా ఆయన తన తాజా మంత్రివర్గంలోకి తీసుకోలేదు.
నిజానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందిన 'శైలజ టీచర్' ను కూడా కొత్త మంత్రివర్గం లోకి తీసుకోలేదు. అంతటి సమర్థురాలిని సైతం తీసుకోకపోవడం ఏమిటంటూ ప్రతిపక్ష పార్టీలు సైతం నొసలు చిట్లించాయి. ఈ నిర్ణయాన్ని సాక్ష్యాత్తు శైలజ టీచరే సమర్ధించారు. కొత్త వారికి అవకాశాలు ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు కూడా.
పినరయి విజయన్ నిర్ణయం ఫలితంగా – రాష్ట్రం లో ఎల్. డి.ఎఫ్ ఇమేజ్ కేరళ రాజకీయాలలో అమాంతం పెరిగి పోయింది. దేశం లోని రాజకీయాలకు దిశా నిర్దేశం చేసింది.
ఇప్పుడు జగన్ కూడా ఇదే ఫార్ములా ను అమలు చేయాలి. అలాగే, నామినేటెడ్ పదవులలో ఉన్నవారిలో-సజ్జల రామకృష్ణారెడ్డి మినహా- మిగిలిన వారిని కూడా మంత్రులతో పాటే తొలగించి- ఆ స్థానాలను కొత్త వారితో భర్తీ చేయాలి. దీనివల్ల, అధికార ఫలాలను- వీలైనంత ఎక్కువ మంది అనుభవంలోకి తీసుకొచ్చిన ఖ్యాతి ముఖ్యమంత్రికి కలుగుతుంది. ఇప్పుడు తీసేసిన వారిలో -పనికి వచ్చే వారుంటే- పార్టీ పనికి ఉపయోగించుకోవచ్చు.
ఈ చర్యవల్ల, అటు పార్టీలోనూ…ఇటు ప్రభుత్వంలోనూ 'ఫ్రెష్ నెస్' భావన కలుగుతుంది. ఆయా ప్రభుత్వ శాఖలకు రిలీఫ్ ఫీలింగ్ ఏర్పడుతుంది. సమధికోత్సాహం తో ఆయా ప్రభుత్వ శాఖలు పని చేయగలుగుతాయి.
అలాగే, వచ్చే ఎన్నికల్లో మొత్తం 174 స్థానాల్లోనూ కొత్త అభ్యర్థులను ఓటర్లకు -జగన్ – వైసీపీ అభ్యర్థులుగా పరిచయం చేయాలి. దీనివల్ల, నిలవుండి, ఈగలు…దోమలు ముసురుకుంటూ..మురికి వాసన వేస్తూ …జనం రోగాలు- రొష్టులకు కారకమయ్యే పాతనీరు స్థానంలో కొత్తనీరు చేరినట్టవుతుంది.
భోగాది వేంకట రాయుడు