ఒక్కో అంశంపై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ చెబుతున్న విషయాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. పూరీ జ్ఞాన ప్రదర్శనకు ‘పూరీ మ్యూజింగ్స్’ వేదికైంది. తాజాగా ఆయన ‘కొశ్చన్ ఎవ్రీథింగ్’ అనే అంశంపై తనవైన అభిప్రాయాలను సూటిగా, సుత్తి లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ప్రశ్నించడంపై పూరీ చెప్పిన సంగతులు ఆకట్టుకుంటున్నాయి. పూరీ చెప్పిన ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
నేర్చుకోవడం అనేది ప్రశ్నించడంతోనే మొదలవుతుందని ఆయన అభిప్రాయం. జీవితంలో అదీఇదీ అని కాకుండా, ప్రతి విష యాన్ని, ప్రతి ఒక్కర్నీ ప్రశ్నించాలని ఆయన తేల్చి చెప్పారు. అప్పుడే మనకు కావాల్సిన సమాధానాలు రాబట్టగలుగు తామన్నారు.
‘ఎందుకు? ఏమిటి? ఎక్కడ? ఎప్పుడు? ఎలా? ఎందుకలా.. చిన్నప్పుడు మనం జీవితం ఇలాగే మొదలవుతుందని చెప్పుకొచ్చారు. అయితే మాటలతోనే ప్రశ్నించడం స్టార్ట్ అవుతుందన్నారు. అయితే కొన్ని ప్రశ్నలకు తల్లిదండ్రులు సమాధానం చెప్పరని పూరీ తెలిపారు. అంతేకాదు, ప్రశ్నించే నోళ్లు నొక్కేస్తారని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రశ్నించే వాళ్లకు ఆయన ఓ విన్నపం చేశారు.
ఎవరైనా.. ‘అలా అడక్కు కళ్లుపోతాయ్’ అని హెచ్చరిస్తే మాత్రం , అలాంటి వాళ్లని అండర్లైన్ చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే అలా చెప్పేవాళ్లలో ఏదో తేడా ఉందని అర్థం చేసుకోవాలన్నారు. ఎలా ప్రశ్నించాలో పూరీ కొన్ని మెళకువలు చెప్పారు. అమాయకంగా, నవ్వుతూ ఎలాంటి ప్రశ్నైనా వేయాలని సూచించారు. మనం వేసే ప్రశ్నను బట్టి సమాధానం వస్తుందన్నారు.
మంచి ప్రశ్న వేస్తే మంచి సమాధానం, చెత్త ప్రశ్న వేస్తే అలాంటి సమాధానమే వస్తుందని పూరీ స్పష్టం చేశారు. మనం సంధించే ప్రశ్న అవతలి వ్యక్తిని ఆలోచనల్లో పడేయాలని ఆయన అన్నారు. ప్రపంచంలో అందర్నీ ప్రశ్నించాలని, ఏ ఒక్కర్నీ విడిచి పెట్టొ ద్దని ఆయన సూచించారు.
ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది అబద్ధపు సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తూ బతికేస్తున్నారని ఈసడించుకున్నారు. అలాంటి యుద్ధాల్లో మీరు ఉండకూడదని సూచించడం గమనార్హం. ఎప్పుడైతే ప్రశ్నించడం ఆగిపోతుందో, అప్పుడు జ్ఞానోదయం అయినట్టుగా గుర్తించాలని పూరీ తెలిపారు.