నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నుంచి కోర్టు ధిక్కరణ నోటీసులు తీసుకోవాల్సి వస్తోంది. అలాగే హైకోర్టు ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.
రఘురామకృష్ణంరాజు పవర్ ఏంటో అధికార పార్టీ వైసీపీకి తెలిసొచ్చింది. రఘురామకృష్ణంరాజు కేసులో జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో చీవాట్లు తప్పలేదు. జగన్ సర్కార్ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని స్వయంగా సుమోటోగా నోటీసులు ఇవ్వడం గమనార్హం.
మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా హైకోర్టు, మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని జగన్ సర్కార్‌ను హైకోర్టు నిలదీసింది.
మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సంబంధించి వైద్య నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తే, ఆరు గంటలు జాప్యం చేయడంపై హైకోర్టు మండిపడింది. సాయంత్రం 6 గంటల వరకూ వైద్య నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించింది
రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద నోటీసులివ్వాలని ఆదేశించింది. సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు వెంటనే నోటీసులివ్వాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌కు ఆదేశాలిచ్చింది. పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.
రఘురామకృష్ణంరాజు ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగినట్టు హైకోర్టు వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లక్షలాది మంది ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధి విషయంలో ప్రభుత్వ అలసత్వాన్ని ఆ మాత్రం ఎండగట్టాల్సిందే. అంతే, అంతేగా మరి!