నిర్మల్ జిల్లా బాసల ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఉద్యమానికి కేసీఆర్ సర్కార్ ఎట్టకేలకు తలొంచింది. వాళ్ల డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించింది. వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమం సత్ఫలితం ఇచ్చింది.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్‌తో సోమవారం అర్ధరాత్రి వరకూ చర్చలు నిర్వహించి, సానుకూల వాతావరణంలో పరిష్కార మార్గం చూపడం విశేషం.
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. దీంతో సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు విద్యార్థులు ఉద్యమాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. మంగళవారం నుంచి తరగతులకు హాజరుకానున్నట్టు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రకటించారు.
చర్చలు ముగిసిన అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ రాత్రి 9.30 నుంచి రెండున్నర గంటలకుపైగా ఈ చర్చలు జరిగాయన్నారు. 12 డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారన్నారు.
మౌలిక సదుపా యాలకు తక్షణమే రూ.5.6 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. గడువులోగా డిమాండ్ల పరిష్కారానికి హామీ, రెగ్యులర్ వీసీ నియామకానికి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. దీంతో తాము ఉద్యమాన్ని విరమించేందుకు నిర్ణయించుకున్నామన్నారు. వెంటనే క్లాస్‌లకు హాజరవుతామన్నారు.