మన దేశంలో మొదటి జనరల్ ఎలక్షన్‌కి 70 ఏళ్లు. 1952లో ఎన్నికలు మొదలయ్యాయి. రకరకాల సెలబ్రేషన్స్ జరుపుకునే మనం ఎన్నికల 70 ఏళ్ల ఉత్సవాన్ని మాత్రం జరుపుకోలేదు. దేశ తల రాతని మార్చే ఎన్నికలపై ఉన్న గౌరవం ఇది.
7 దశాబ్దాలలో ఎన్నికల ప్రచారం కూడా పూర్తిగా మారిపోయింది. వచ్చే ఎన్నికల ప్రచారం, ప్రాణం మొత్తం మొబైల్ ఫోన్‌లో వుంది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా అందరి చేతుల్లో ఫోన్‌లున్నాయి. కొంత మందికి రెండుమూడు కూడా వున్నాయి. 140 కోట్ల జనాభా వుంటే 60 కోట్ల మందికి ఇంటర్‌నెట్ యాక్సెస్ వుందని ఒక అంచనా. దీంట్లో కనీసం 50 కోట్ల మంది సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వున్నారు. ఏడాదికి 2 కోట్ల మంది అదనంగా సోషల్ మీడియాలో వచ్చి చేరుతున్నారు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో జరిగేది వేదికలు, టీవీల్లో యుద్ధం కాదు, సోషల్ మీడియా యుద్ధం.
2007లో యూపీలో జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా మొబైల్ ఫోన్ పవర్ నాయకులకి అర్థమైంది. దాంతో అందరూ దాని వెంట పడ్డారు. ఇపుడు ఫోన్ లేకపోతే రాజకీయమే లేదు.
1952లో అసలు ప్రచారమే లేదు. అక్కడక్కడ గోడలకి ఎన్నికల గుర్తులు పెయింట్ చేసేవాళ్లు. కొన్ని పాంప్లేట్లు పంచేవాళ్లు. క్రమేపి అది ఊరేగింపులు, రిక్షాలకి మైకులు తగిలించడం వరకు వచ్చింది. 1977 నాటికి వీధుల్లో ఆఫీసులు పెట్టి పార్టీ పాటలతో సౌండ్ పొల్యూషన్ స్టార్ట్ చేశారు. 1980 దాటే సరికి పత్రికల్లో ప్రకటనలు పెరిగాయి. మధ్యలో శేషన్ పుణ్యమా అని గోడ రాతలు, మైకులు పోయాయి. 2000 నాటికి వీధుల్లో ప్రచారం తగ్గి, ఇళ్లలోకి పెయిడ్ ఆర్టికల్స్, టీవీల చర్చల ద్వారా వచ్చింది. ఎపుడైతే స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చిందో ప్రపంచమే మారిపోయింది. ఓటరుకి డబ్బు కూడా ఫోన్‌లోనే.
ఉద్యమాలు, ధర్నాలే కాదు ఎన్నికలని కూడా సోషల్ మీడియానే శాసించే స్థాయి వచ్చేసింది. అయితే ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని స్థితి. అందుకే ప్రభుత్వం కొన్ని రూల్స్, గైడ్‌లైన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. హద్దూఅదుపూ లేని సోషల్ మీడియాని ఇన్ని కోట్ల మంది ఇష్టానుసారం వాడుతున్న దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? అంత వ్యవస్థ మనకి వుందా?
జీఆర్ మహర్షి