విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు దాదాపు ఖరారైనట్టు తెలిసింది. గతంలో ఇద్దరుముగ్గురి పేర్లు తెరపైకి రావడం, ఆ తర్వాత వాళ్లు వెనక్కి తగ్గడంతో విపక్షాలకు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సవాల్‌గా మారింది.
ఇప్పటికే మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణగాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పేర్లు వివిధ సందర్భాల్లో ప్రముఖంగా వినిపించాయి. అయితే వారెవరూ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో కొత్త నాయకుడు తెరపైకి వచ్చారు.
కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ ఉపాధ్యక్షుడైన యశ్వంత్ సిన్హా పేరు దాదాపు ఖరారైందని సమాచారం. యశ్వంత్ తాజా ట్వీట్ ఈ విషయాన్ని బలపరుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే నిమిత్తం ఆయన టీఎంసీకి రాజీనామా చేయడం గమనార్హం. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు.
“టీఎంసీలో మమతాగారు నాకు అందించిన గౌరవం, ప్రతిష్టకు నేను కృతజ్ఞుడిని. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం, విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి పార్టీ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. ఆమె నా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నా” అని ఆయన ట్వీట్ చేశారు ఆయన. ఇవాళ సాయంత్రం ఆయన పేరును అధికారికంగా ప్రకటించొచ్చు. ఇదిలా ఉండగా యశ్వంత్ సిన్హా బిహార్‌లో పుట్టి పెరిగారు. ఐఏఎస్ అధికారి. 1984లో ఉన్నతోద్యోగానికి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు.
నాలుగేళ్లకు రాజ్యసభకు వెళ్లారు. జనతా దళ్ ప్రభుత్వంలో.. పార్టీ జనరల్ సెక్రటరీగా పని చేశారు. ఆపై చంద్రశేఖర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పని చేశారు. 22 ఏళ్ల పాటు బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేశారు. లోక్‌సభ ఎంపీగా, పార్టీ కీలక ప్రతినిధిగా, ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
మోదీతో ఆయనకు విభేదాలొచ్చి 2018లో పార్టీ నుంచి వైదొలిగారు. గత ఏడాది టీఎంసీలో చేరారు. ప్రస్తుతం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అయ్యే అవకాశాలున్నాయి.