భల్లూకం పట్టు అంటే ఎలుగుబంటి పడితే చాలా గట్టిగా పట్టుబడుతుందని ఒక నమ్మకం. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి వచ్చింది. దాన్ని పట్టుకోడానికి అటవీ అధికారులు వచ్చారు. వాళ్లను మించి టీవీ రిపోర్టర్లు కెమెరాలతో వచ్చారు. భల్లూకానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి నెమ్మది చేశారు కానీ, విలేకరులు మాత్రం విజృంభించారు.
రిపోర్టర్ః ఇపుడు అటవీ అధికారి మన ముందున్నారు. చెప్పండి సార్ ఎలుగుబంటి అడవిలో ఉండకుండా ఇళ్ల మీదికి ఎందుకొచ్చింది?
అధికారిః అడవిలో ఫుడ్ లేనపుడు వూళ్ల మీదికొస్తాయి.
రిపోర్టర్ః అడవిలో ఫుడ్ ఎందుకు లేదు?
అధికారిః అయోమయంగా చూశాడు.
రిపోర్టర్ః అడవిలో ఫుడ్ లేకపోవడానికి అటవీశాఖ బాధ్యత వహిస్తుందా?
అధికారిః మేము మా బాధ్యతగా చెట్లని పెంచుతున్నాం
రిపోర్టర్ః ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ షూట్ చేశారు. మత్తు ఎక్కుతుందా?
అధికారిః అది ఎలుగుబంటి చెప్పాలి
రిపోర్టర్ః ఒకవేళ మత్తు ఎక్కకపోయినా ఎక్కినట్టు నటిస్తే
అధికారిః అది జంతువు, మనుషుల్లా నటించలేదు.
రిపోర్టర్ః మత్తు ఎంత సేపులో ఎక్కుతుంది?
అధికారిః 20 నిమిషాలు
ఈలోగా స్టూడియో నుంచి యాంకర్ కల్పించుకుని
శంకర్, మన ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలుగుబంటి ఒడ్డు పొడవు తెలుసుకోవాలని, అదే విధంగా అది దాడి చేసినప్పుడు నోటితో దాడి చేస్తుందా? గోళ్లతో దాడి చేస్తుందా? అధికారుల్ని అడిగి తెలుసుకో
రిపోర్టర్ః అదే తెలుసుకుంటున్నా, దగ్గరికి వెళితే తప్ప, గోళ్లు ఎంత పొడవు వుంటాయో చెప్పలేమంటున్నారు. అదే విధంగా ఎలుగు ఆడా, మగో చెప్పలేకపోతున్నారు. జెండర్ ఏదైనా కరవడం మానవని అధికారులు Confirm చేస్తున్నారు. ఎలుగుబంటికి మత్తెక్కి నిద్రపోతున్నట్టుంది. గురక వస్తూ వుంది. కాబట్టి డీప్ స్లీప్‌లో వున్నట్టు భావించొచ్చు.
యాంకర్ః ఎలుగుబంటి కూడా గురక పెడుతుందా?
రిపోర్టర్ః ఎలుగుబంట్లు గురక పెడతాయని ఇపుడే తెలుసుకున్నామని అధికారులు అంటున్నారు. అయితే ఇండియా ఎలుగుబంట్లు ఎక్కువ గురక పెడతాయని గూగుల్ కొడితే తెలిసింది. ఇపుడే బోన్ వచ్చింది. ఎలుగు ఒకవేళ నిద్రలేస్తే ఇక్కడ ఉన్నవాళ్లంతా పారిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కొసమెరుపుః టీవీ బృందం వాహనాన్ని ఎలుగు వెంబడించిందట. టీవీ చూడకపోయినా, టీవీల వాళ్ల మీద కోపం పెంచుకుందంటే అది మామూలు ఎలుగుబంటి కాదు.
జీఆర్ మహర్షి