2020 టాలీవుడ్ కు చాలా ఆశాజనకంగా స్టార్ట్ అయింది. జనవరి నెల సినిమాలు వందల కోట్ల మేరకు మనీ స్పిన్ చేసి, సినిమా వ్యాపారం మీద ఆశలు పెంచాయి. దాంతో ఒక్కసారిగా సినిమాల అమ్మకాలు, నిర్మాణాలు ఊపందుకున్నాయి. కానీ ఇలాంటి టైమ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా 2020 నుంచి 2021 కు జరిగి చిన్న జర్క్ ఇచ్చింది. కీలకమైన సమ్మర్ టైమ్ కు సరైన పెద్ద సినిమా లేదన్న ఫీల్ కలిగించింది. అలాగే దసరాకు సరైన పెద్ద సినిమా వచ్చే అవకాశాలు కూడా ఇబ్బందిలో పడ్డాయి.
ఈ పరిస్థితి నుంచి సర్దుకుని, మీడియం సినిమాలు అన్నీ ప్లాన్డ్ గా విడుదలకు సిద్దం అయ్యాయి. మార్చి మూడో వారం నుంచి వరుసగా మే మధ్య వరకు సినిమాలు పరుచుకున్నాయి. అంతా బాగుంది అనుకునే టైమ్ కు కరోనా విరుచుకు పడింది. దీంతో మళ్లీ మరోసారి జర్క్ తప్పడం లేదు.
ఏప్రియల్ 1 నుంచి మళ్లీ థియేటర్ల తలుపులు తెరుచుకుంటాయి. కానీ అది పక్కా అని ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే కరోనా వ్యవహారం రోజు రోజుకు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. నిజానికి ఇప్పుడు కరోనా వ్యవహారం తెలంగాణలో పెద్దగా లేదు. అయినా ముందు జాగ్రత్తగా థియేటర్ల తలుపులు మూసారు. రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఏమాత్రం కేసులు పెరిగినా, థియేటర్లు మరికొన్నాళ్లు మూత పడాల్సిందే తప్ప తెరుచుకోవు. అలా జరగదనే ఆశిద్దాం.
ఇదిలా వుంటే షూటింగ్ లు క్యాన్సిల్ కావడం మరో సమస్య. ఆర్ఆర్ఆర్ ఉత్తరాదిలో షూటింగ్ షెడ్యూలు చేసుకుంది. కానీ ఇప్పుడు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ టైట్ షెడ్యూలులో జనవరికి విడుదల ప్లాన్ చేసుకుంది. ఇప్పుడు ఆ షెడ్యూలు ఓ నెల రోజులు దెబ్బతింటే, మళ్లీ విడుదల ప్రశ్నార్థకమవుతుంది. ఆర్ఆర్ఆర్ లేటయితే ఎన్టీఆర్-చరణ్ ల తరువాత సినిమాలు కూడా లేటు అవుతాయి.
ఆర్ఆర్ఆర్ లేదు కనుక ఈ ఏడాది దసరా, దీపావళి సీజన్ మీద టార్గెట్ పెట్టిన సినిమాలు వున్నాయి. మెగాస్టార్ ఆచార్య, బన్నీ-సుకుమార్ సినిమా వీటిలో వున్నాయి. ఆచార్య సినిమా ఇప్పుడు షూట్ నిలిపివేసింది. బన్నీ-సుకుమార్ సినిమా కేరళ షెడ్యూలు క్యాన్సిల్ అయింది. మారేడుమిల్లి లో ప్లాన్ చేసారు. అది వుంటుందో వుండదో తెలియదు.
ఇవన్నీ ఇలా వుంచితే, టాలీవుడ్ లో ఏప్రియల్ విడుదలలు వరుసగా వున్నాయి. అవన్నీ అలాగే వుంటే ఓకె, లేదు మరికొన్నాళ్లు థియేటర్లు మూత అంటే అంతా కిందా మీదా అయిపోతుంది. సినిమాలు వాయిదా పడడం, నిర్మాణం ఆలస్యం కావడంతో అంటే చిన్న విషయం కాదు. కోట్లలో తెచ్చిన ఫైనాన్స్ కు వడ్డీలు తడిసి మోపెడవుతాయి,.
అసలే థియేటర్లు దాదాపు రెండు నెలలుగా నీరసంగా నడుస్తున్నాయి. నిర్వహణ ఖర్చులు కిట్టుబాటు కావడం లేదు. థియేటర్లు మూసి వేస్తే కరెంటు బిల్లులు తగ్గుతాయేమో కానీ జీతాల ఖర్చులు తగ్గవు. పైగా ఎక్కువ థియేటర్లు లీజు మీద నడుస్తున్నాయి. థియేటర్ లాభం అయినా, నష్టం అయినా, లీజు చెల్లించాల్సిందే. ఇప్పుడు మూత పెట్టి మరీ లీజు చెల్లించాలంటే మరింత కష్టం.
మొత్తం మీద కరోనా వ్యవహారం టాలీవుడ్ ను కాస్త గట్టిగా కుదిపేసాలా కనిపిస్తోంది.